కొండపల్లి వక్ఫ్ భూమి రిజిస్ట్రేషన్‌పై కలకలం..

ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్‌కు వక్ఫ్ బోర్డు నోటీసులు

ఆంధ్రప్రభ కథనంపై స్పందించిన వక్ఫ్ బోర్డు.. అక్రమ రిజిస్ట్రేషన్‌పై వివరణ కోరిన అధికారులు

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణంలోని సర్వే నంబర్ 293/1లో ఉన్న వక్ఫ్ బోర్డు భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు స్పందించారు. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ, వక్ఫ్ చట్టం–1995 ప్రకారం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేశారు.

కొండపల్లి పట్టణంలోని సర్వే నంబర్ 293లో ఉన్న హజరత్ ముర్తుజా అలీ పంజా వక్ఫ్ బోర్డు భూమిని విక్రయిస్తామని చెప్పి కరణం సుధీర్ కుమార్ అనే వ్యక్తి తన వద్ద నుంచి రూ.18 లక్షలు తీసుకున్నారని, అనంతరం అదే భూమిని వేరే వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారని బాధితుడు వేణు జిల్లా కలెక్టర్ లక్ష్మీషకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఆంధ్రప్రభలో కథనం ప్రచురితమైంది.

హజరత్ ముర్తుజా అలీ పంజాకు చెందిన 1,800 చదరపు గజాల పీర్లపంజా చావిడి, దానికి అనుబంధంగా ఉన్న శాంతినగర్‌లోని సర్వే నంబర్లు 212ఏ, 212బీలోని 18.30 ఎకరాల వక్ఫ్ భూములకు ఇష్టానుసారంగా పన్నులు విధిస్తూ, సర్వే నంబర్లు మార్చి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు అల్తాఫ్ బాబా ఆరోపించారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేశారు. నోటీసుల ప్రతులను జిల్లా కలెక్టర్, డీఆర్వో, తహసీల్దార్, ఇబ్రహీంపట్నం హౌస్ ఆఫీసర్‌కు కూడా పంపించారు.