మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేద్దాం…

మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేద్దాం…
మహిళా విభాగం ఛైర్‌పర్సన్ నిర్మలకుమారి, కన్వీనర్ పి.మాధవి
ఆంధ్రప్రభ, విజయవాడ : మహిళా ఉద్యోగులలో చైతన్యం నింపి… కొత్త ఉత్సాహంతో ముందుకు అడుగులు వేసేలా ఏపీ ఎన్‌జీజీవో మహిళా విభాగం నిరంతరం కృషిచేస్తోందని.. ఇందులో భాగంగా నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయడం ద్వారా మహిళలను సంఘటితను చాటిచెప్పాలని మహిళా విభాగం అధ్యక్ష, కన్వీనర్లు నిర్మలకుమారి, పి.మాధవిలు మహిళా ఉద్యోగులకు పిలుపునిచ్చారు. గాంధీనగర్‌లోని ఎన్‌జీవో హోమ్‌లో మహిళా విభాగం ప్రతినిధులు మీడియా సమావేశంలో రాష్ట్ర ఛైర్‌పర్సన్ నిర్మలకుమారి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తిచేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా మహిళా ఉద్యోగులకు ఆటలు, పాటలు, సాంస్కృతి కార్యక్రమాలపై పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.

ఈనెల 4వ తేదీన ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ బ్లాక్స్, షాట్ పుట్, అంత్యాక్షరి అంశాలపైనా, అయిదో తేదీన దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాట్మింటన్ సింగిల్, డబుల్స్ పోటీలు, ఏపీ ఎన్‌జీవో హోమ్‌లో మినిట్ గేమ్, క్యారమ్స్, వ్యాసరచన పోటీలను, ఆరోతేదీన పాటలు, నృత్య పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటేషన్స్‌ను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఎన్‌జీవో హోమ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివ, ఇతర ప్రజాప్రతినిధులు, మహిళా ఐఏఎస్ అధికారులతో పాటు ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాలకు చెందిన మహిళా విభాగం ప్రతినిధులు, మహిళా ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొంటారని తెలిపారు.

రాష్ట్ర కన్వీనర్ పి.మాధవి మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఉత్సాహంతో సేవలందించడం ద్వారా వారు పనిచేస్తున్న కార్యాలయాల్లో మంచి గుర్తింపు పొందగలుగుతారన్నారు. మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ నాయకత్వంలో రాష్ట్ర కార్యవర్గం అవిరళ కృషిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఇటీవల మహిళా ఉద్యోగులకు వయసుతో నిమిత్తం లేకుండా ఛైల్డ్ కేర్ లీవ్‌ను ఉపయోగించుకునేలా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను తీసుకురావడం జరిగిందని. తద్వారా దాదాపు అయిదు లక్షల మంది మహిళా ఉద్యోగులు లబ్ధి పొందగలుగుతున్నారన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర నాయకత్వం సహకారంతో మహిళా విభాగం కృషిచేస్తోందన్నారు. మహిళా ఉద్యోగులు పెద్దఎత్తున మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయడం ద్వారా మహిళా ఉద్యోగుల ఐక్యతను మరోసారి చాటిచెప్పాలని మాధవి కోరారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఏపీ ఎన్‌జీజీవో మహిళా విభాగం ప్రతినిధులు కె.శివలీల, వి.శాంతిశ్రీ, బి.జానకి, ఎం.సరస్వతి, బి.విజయశ్రీ, సీహెచ్ నాగమల్లేశ్వరి, ఎస్.దివ్య, వి.సురేఖ, పి.తులసీరత్నం తదితరులు పాల్గొన్నారు.
