Gurukul Tenders | ఆధారాలు ఉంటే బయటపెట్టాలి: మంత్రి పొన్నం
Gurukul Tenders | ఆధారాలు ఉంటే బయటపెట్టాలి: మంత్రి పొన్నం
గురుకుల టెండర్లపై మాట్లాడిన పొన్న ప్రభాకర్
‘రూ.1,142 కోట్ల టెండర్లలో రూ.2 వేల కోట్ల స్కాం ఎలా సాధ్యం?’ అంటూ బీఆర్ఎస్‌కు ప్రశ్న
గన్‌పార్క్ పరిణామాలపై వివరణ.. ‘పోలీసులతో అరెస్టులు చేయించేంత పిరికివాళ్లం కాదు’
గురుకులాల కేంద్రీకరణ విద్యార్థుల ప్రయోజనాల కోసమేనని స్పష్టం
Gurukul Tenders | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : గురుకుల విద్యాసంస్థల టెండర్ల వ్యవహారం, గన్‌పార్క్ వద్ద జరిగిన రాజకీయ పరిణామాలపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన, ప్రభుత్వంపై ఆధారాలు లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. టెండర్ల విషయంలో వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
మీడియాతో మాట్లాడుతూ.. గన్‌పార్క్ వద్ద జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చిన మంత్రి, గోషామహల్, మలక్‌పేట ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. హరీశ్‌రావు ఫోన్ ఎత్తలేదని ఆరోపిస్తున్నారని, అయితే మీడియాకు చెందిన జర్నలిస్టు రాహుల్ ఫోన్ చేస్తే ఆయన స్పందించలేదా అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం తమకు ఉందని, పోలీసులతో ప్రత్యర్థులను అరెస్టు చేయించేంత పిరికివాళ్లు కాదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజా ప్రయోజనాల కోసం ప్రతిపక్షాన్ని విమర్శించామని, ఇప్పుడు కూడా అదే చేస్తున్నామని పేర్కొన్నారు. తాను, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇద్దరూ కింది స్థాయి నుంచి ఎదిగిన నాయకులమని, తమ రాజకీయ ప్రయాణం అందరికీ తెలుసని అన్నారు. కొందరు వ్యక్తులు చెప్పిన సమాచారాన్ని మాత్రమే నమ్మి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని హితవు పలికారు.
గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందన్న ఆరోపణలను ఖండించిన మంత్రి, మొత్తం టెండర్ల విలువ రూ.1,142 కోట్లు మాత్రమేనని తెలిపారు. అలాంటప్పుడు రూ.2 వేల కోట్ల స్కాం జరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ప్రతి అంశానికి సంబంధించిన పత్రాలు, రికార్డులు ప్రభుత్వ వద్ద ఉన్నాయని, అవసరమైతే వాటిని ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
గురుకుల విద్యాసంస్థల్లో పారదర్శకత, నాణ్యత పెంపు, పరిపాలన సులభతరం చేయడం, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా వ్యవస్థను కేంద్రీకరించామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ చర్యలను రాజకీయ కోణంలో కాకుండా ప్రజా ప్రయోజనాల దృష్టితో చూడాలని ఆయన సూచించారు.
