Political Debate | మంత్రులు సెల్ఫ్‌గోల్ కొట్టుకున్నారు : వేముల ప్రశాంత్‌రెడ్డి

Political Debate | మంత్రులు సెల్ఫ్‌గోల్ కొట్టుకున్నారు : వేముల ప్రశాంత్‌రెడ్డి

సవాల్ పేరుతో బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి విమర్శలు
‘రేవంత్‌రెడ్డి తీరు గతంలోనూ ఇలాగే ఉంది.. సవాళ్లు విసరడం, తప్పించుకోవడం కొత్త కాదు’
కేటీఆర్, హరీశ్‌రావును చర్చకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపణ

Political Debate | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర అప్పులు, ప్రభుత్వ పనితీరుపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న రాజకీయ వాగ్వాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజల ముందే చర్చకు వస్తామని సవాళ్లు విసిరిన కాంగ్రెస్ మంత్రులు చివరకు సమాధానం చెప్పలేక వెనక్కి తగ్గారని, పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలను చర్చకు రాకుండా చేశారని ఆరోపించారు.

నిన్న జరిగిన పరిణామాలను ప్రజలంతా చూశారని పేర్కొన్న ఆయన.. కాంగ్రెస్ మంత్రుల “డొల్లతనం” బట్టబయలైందన్నారు. మొదట చర్చకు ఆహ్వానించి, అనంతరం వేదికలు మార్చుతూ చివరకు పోలీసులు రంగంలోకి దించి బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారని విమర్శించారు. “మంత్రులు గెలుస్తామని అనుకుని చివరకు సెల్ఫ్‌గోల్ కొట్టుకున్నారు. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్నట్టుగా కాంగ్రెస్ పరిస్థితి తయారైంది” అంటూ ఎద్దేవా చేశారు.

రేవంత్‌పై సినీ పాత్రతో పోలిక

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరును ఓ సినిమా పాత్రతో పోలుస్తూ వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ‘సై’ సినిమాలో నటుడు వేణుమాధవ్ తనను తాను ఎంతో గొప్పగా చెప్పుకునే పాత్రను గుర్తు చేస్తూ.. చివరకు హీరో ఎదురుపడగానే ఆ బిల్డప్ మొత్తం కూలిపోతుందని, నిన్న సీఎం రేవంత్‌రెడ్డి పరిస్థితి కూడా అలాంటిదేనని వ్యాఖ్యానించారు. “చర్చ అంటారు.. సవాళ్లు విసురుతారు.. మంత్రులను ముందుకు పంపుతారు.. చివరకు అంతా తోక ముడుస్తారు. కేటీఆర్, హరీశ్‌రావు ఎదురుదెబ్బకు ఆ బిల్డప్ అంతా తేలిపోయింది” అని అన్నారు.

‘సవాళ్లు విసరడం.. తప్పించుకోవడం రేవంత్‌కు కొత్త కాదు’

సవాళ్లు విసిరి వాటి నుంచి తప్పించుకోవడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కొత్త కాదని వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. గతంలో ప్రెస్‌క్లబ్‌లో చర్చకు వస్తానని సవాల్ విసిరి, కేటీఆర్ మూడు గంటలు ఎదురుచూసినా రాలేదని గుర్తు చేశారు. అనంతరం “ప్రెస్‌క్లబ్ ఏమైనా కళ్లుకాంపౌండా?” అంటూ వ్యాఖ్యానించారని విమర్శించారు.

అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్‌రెడ్డి ప్రకటించారని, కానీ బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన కొద్ది నెలలకే మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేశారని పేర్కొన్నారు. “సవాళ్లు విసరడం.. తర్వాత మాట మార్చడం రేవంత్‌కు వెన్నతో పెట్టిన విద్య” అని వ్యాఖ్యానించారు.

రైతు రుణమాఫీపై విమర్శలు

రైతు రుణమాఫీ విషయంలో కూడా సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో గ్రామాలకు వెళ్లిన ప్రతిచోటా దేవుళ్లపై ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారని, ఇప్పటికీ ఆ హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు.

‘పోలీసులతో అడ్డుకున్నారు’

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ పాలనపై సవాళ్లు విసిరారని, వాటిని కేటీఆర్ స్వీకరించి ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారని వేముల తెలిపారు. ఆ తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్‌కు వస్తానని, చర్చకు సిద్ధమని ప్రకటించారని గుర్తు చేశారు.

తర్వాత వేదిక మార్చి గన్‌పార్క్‌కు రావాలని చెప్పారని, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల టెండర్లలో అవినీతి అంశంపై కూడా చర్చిస్తామని మంత్రులు ప్రకటించారని తెలిపారు. అయితే హరీశ్‌రావు సంబంధిత పత్రాలతో బయల్దేరగా ఆయనను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. డీసీఎంలో నగరమంతా తిప్పి చివరకు పోలీస్‌స్టేషన్‌కు తరలించారని చెప్పారు.

అలాగే కేటీఆర్ గన్‌పార్క్‌కు వెళ్లేందుకు ప్రయత్నించినా ఆయనను కూడా పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. “చర్చకు పిలిచి.. మళ్లీ పోలీసులు పెట్టి అడ్డుకోవడం ఎందుకు? సవాళ్లు విసిరి అరెస్టులు చేయడం ఎందుకు?” అని కాంగ్రెస్ మంత్రులను ప్రశ్నించారు.

రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటోందని వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు సవాళ్లు విసిరి చివరకు వెనక్కి తగ్గడం ప్రజలంతా గమనించారని, దీనిపై రాష్ట్ర ప్రజలు తగిన సమయంలో సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.