బాకీ బియ్యం తప్పనిసరిగా అప్పగించాలి
నిర్లక్ష్యం చేస్తే రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు
టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ ప్రభాకర్ హెచ్చరిక
ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి: డిఫాల్ట్ మిల్లర్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ ప్రభాకర్ శుక్రవారం భూపాలపల్లి కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 100 శాతం బియ్యం సరఫరా, 25 శాతం పెనాల్టీ వసూళ్లు, 2022-23 రబీ సీజన్‌లో వేలం వేసిన వడ్లకు సంబంధించిన బియ్యం రికవరీ అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
సమావేశంలో ఓఎస్‌డీ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి బాకీ ఉన్న బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి స్థాయిలో అప్పగించాలని మిల్లర్లను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా బియ్యం అందజేయని మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రెవెన్యూ రికవరీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ధాన్యం, బియ్యం రికవరీ విషయంలో ఎలాంటి అలసత్వం సహించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బియ్యం సరఫరా ప్రక్రియను వేగవంతం చేసి పెండింగ్ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని మిల్లర్లకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ రాములు, జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, ఏఎస్‌వో వేణుగోపాల్, డీటీలు రాజు, సురేందర్‌తో పాటు డిఫాల్ట్ మిల్లర్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
