పెన్ష‌న్ల పంపిణీలో సంతృప్తి స్థాయి ప్ర‌ధానం

పెన్ష‌న్ల పంపిణీలో సంతృప్తి స్థాయి ప్ర‌ధానం

విజయవాడ, ఆంధ్రప్రభ : సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో లబ్ధిదారుల సంతృప్తి స్థాయి అత్యంత ముఖ్యమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. లబ్ధిదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా సేవలు అందించాలని ఆయన సూచించారు.

సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పెన్షన్ పంపిణీ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక భద్రత పెన్షన్లు పేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో ప్రతి నెల సుమారు 2,26,396 మంది లబ్ధిదారులకు రూ. 98.52 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.

పెన్షన్ పంపిణీలో పారదర్శకత, సమయపాలన పాటిస్తూ ఎలాంటి ఫిర్యాదులకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను నిరంతరం పరిశీలించి లోటుపాట్లు ఉంటే వెంటనే సరిచేయాలని సూచించారు.

లబ్ధిదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటి వద్దే పెన్షన్ అందించడం, అవినీతి రహిత సేవలు అందించడం ప్రతి అధికారి బాధ్యత అని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం సహించేది లేదని హెచ్చరించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం అధికారుల బాధ్యత అని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు పాల్గొన్నారు.


Leave a Reply