ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్‌కు తాత్కాలికంగా తాళం..

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్‌కు తాత్కాలికంగా తాళం..

నేటి నుంచి జూన్ 12 వరకు మరమ్మత్తులు

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఘాట్ రోడ్డును నేటి నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ప్రకటించారు.

భక్తులకు మరింత మెరుగైన సేవలు, సురక్షిత రాకపోకలు కల్పించేందుకు ఘాట్ రోడ్డుకు విస్తృత స్థాయి మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆర్ & బీ శాఖ ఆధ్వర్యంలో మే 28 నుంచి జూన్ 12 వరకు వివిధ దశల్లో ఈ పనులు కొనసాగనున్నాయని వెల్లడించారు.

బుధవారం సాయంత్రం కామధేను అమ్మవారి ఆలయం వద్ద ఘాట్ రోడ్డుకు వెళ్లే గేట్లను తాళాలు వేసి పూర్తిగా మూసివేశారు. రహదారి దెబ్బతినడం, గుంతలు పెరగడం, వర్షాకాల పరిస్థితుల నేపథ్యంలో భద్రత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇకపై ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేయబడతాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ప్రత్యేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా కనకదుర్గ నగర్ వైపు నుంచి కొండపైకి చేరుకునేలా ప్రత్యేక రవాణా, మార్గదర్శక సౌకర్యాలు కల్పించారు.

భక్తుల రద్దీని నియంత్రించేందుకు దేవస్థానం సిబ్బంది, భద్రతా సిబ్బందిని నియమించినట్లు ఈవో తెలిపారు. భక్తులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరమ్మత్తు పనులు పూర్తయిన తర్వాత ఘాట్ రోడ్డును మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.

Leave a Reply