నకిలీ రూ.500 నోట్ల కలకలం

పోలీసుల అదుపులో ఇద్దరు

భీమవరం లింక్‌పై దర్యాప్తు..
మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం
నాగర్‌కర్నూల్ డీఎస్పీ ఆధ్వర్యంలో ముమ్మర విచారణ

నాగర్‌కర్నూల్ (ఆంధ్రప్రభ): నాగర్‌కర్నూల్ జిల్లాలో నకిలీ రూ.500 నోట్ల చలామణి కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో బిజినపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి విచారణలో లభించిన వివరాల ఆధారంగా నకిలీ నోట్లు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి జిల్లాకు చేరినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు భీమవరానికి వెళ్లి దర్యాప్తు చేపట్టగా, అక్కడ పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

మంగనూరు గ్రామంలోని ఓ వైన్‌షాప్‌లో నకిలీ నోట్లతో మద్యం కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంతరం ఆ నోట్లను బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లగా అవి నకిలీవని తేలడంతో వైన్‌షాప్ క్యాషియర్ బిజినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో జిల్లాలోకి ఎంత మొత్తంలో నకిలీ నోట్లు వచ్చాయి, వాటి పంపిణీలో ఎవరెవరు ఉన్నారు, దీని వెనుక ఉన్న ముఠా వివరాలు ఏమిటన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణ పూర్తైన అనంతరం నిందితులను అధికారికంగా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.