డీఎస్సీపై బహిరంగ చర్చకు రండి: ఫతావుల్లా
- వెల్లంపల్లి, అవినాష్, మల్లాది విష్ణులకు చర్చకు ఆహ్వానం
- నారా లోకేష్ చర్చకు సిద్ధమని ప్రకటించినా ముందుకు రాని వైసీపీ
- ర్యాలీకి 50–100 మందికి మించి జనం లేరు
- లోకేష్‌పై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు
- వైసీపీ నేతలకు టీడీపీ సవాల్..
( భవానిపురం, ఆంధ్రప్రభ) : డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్‌సీపీ నేతలకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని టీడీపీ రాష్ట్ర మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ ఫతావుల్లా సవాల్ విసిరారు. విజయవాడ గణపతిరావు రోడ్డులోని ఎంపీ కేశినేని చిన్ని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ ఇప్పటికే చర్చకు సిద్ధమని ప్రకటించారని, ఆన్‌లైన్‌లో అయినా చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసినా వైసీపీ నేతలు ముందుకు రావడం లేదని ఫతావుల్లా విమర్శించారు.
చర్చకు వస్తామని చెబితే వెల్‌లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు కోసం మూడు కుర్చీలు సిద్ధం చేశామని ఎద్దేవా చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ నిర్వహించిన ర్యాలీకి 50 నుంచి 100 మంది కార్యకర్తలు కూడా హాజరు కాలేదని, అలాంటి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. ర్యాలీగా వస్తే అడ్డుకుంటామని తెలిసే రూట్‌మ్యాప్ మార్చుకుని మరో మార్గంలో వెళ్లారని విమర్శించారు. ‘జెన్ జీ వార్’ పేరుతో వైసీపీ నిర్వహించిన కార్యక్రమంలో యువత, విద్యార్థుల కంటే 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువగా కనిపించారని ఫతావుల్లా అన్నారు.
‘జెన్ జీ వార్’ అంటే ఏమిటో వైసీపీ నేతలకే కాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కూడా తెలియదని విమర్శించారు. నెలకు రెండుసార్లు తాడేపల్లి పార్టీ కార్యాలయానికి వచ్చి విలేకరుల సమావేశాలు నిర్వహించి బెంగళూరు వెళ్లిపోవడమే జగన్‌కు తెలిసిన ‘వార్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డీఎస్సీపై చర్చకు ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైసీపీ నేతలు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, మంత్రి నారా లోకేష్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఫతావుల్లా హెచ్చరించారు.
