మంత్రి ఉత్తమ్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ
రిజర్వాయర్లను నింపి సాగునీరు అందించాలి..
అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, బస్వాపూర్‌కు నీరు ఇవ్వాలని డిమాండ్
మిడ్‌మానేరు నుంచి నీటిని పంపింగ్ చేసి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, ఆంధ్రప్రభ: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను నీటితో నింపి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. రిజర్వాయర్లలో నీటిని నింపకపోవడంతో పంటల సాగు ముందుకు సాగడం లేదని, రైతులు ఆందోళనలో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను వెంటనే నింపే చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మిడ్‌మానేరు నుంచి మోటార్లను ఆన్ చేసి నీటిని పంపింగ్ చేయాలని సూచించారు.
నాలుగు లక్షల ఎకరాలకు నీరు
రిజర్వాయర్లతో పాటు వాటి పరిధిలోని చెరువులు, చెక్‌డ్యామ్‌లను కూడా నీటితో నింపాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. తద్వారా సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీరు అందుబాటులోకి రాకపోతే రైతులు పంటల సాగుపై ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నీటి లభ్యత, ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మోటార్లను వినియోగించి అవసరమైన ప్రాంతాలకు నీటిని తరలించడం ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపేందుకు చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు కోరారు. రైతులకు సాగునీటి భరోసా కల్పించేలా ప్రభుత్వం వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
