జేపీఎస్సీ ఆందోళన ఉద్ధృతం.. రాంచీలో సెక్షన్ 163 అమలు
- అసెంబ్లీ ముట్టడికి ముందు భారీ ఆంక్షలు..
- కొవ్వొత్తులతో విద్యార్థుల నిరసన
రాంచీ, ఆంధ్రప్రభ : జేపీఎస్సీ, జేఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా జార్ఖండ్ విద్యార్థులు చేపట్టిన ఆందోళన మరింత ఉద్ధృతమైంది. నిరసనలో భాగంగా ఆదివారం రాత్రి రాంచీలో విద్యార్థులు త్రివర్ణ పతాకాలతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నియామక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, అవకతవకలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
జేపీఎస్సీ పరీక్షలపై విద్యార్థుల ఆందోళన 15వ రోజుకు చేరుకుంది. ఈ ఉద్యమానికి ఎలాంటి రాజకీయ పార్టీల సంబంధం లేదని, ఇది పూర్తిగా విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటమని విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు. నియామక పరీక్షలపై కాలపరిమితితో కూడిన సీబీఐ విచారణ జరపాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు.
సోమవారం ప్రతిపాదించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో రాంచీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్త అసెంబ్లీ భవనం పరిసరాల్లో 750 మీటర్ల పరిధిలో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 163ను అమలు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడంపై ఆంక్షలు విధించారు.
ఇదిలా ఉండగా.. బాలీవుడ్ నటుడు పీయూష్ మిశ్రా విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. రాంచీలోని నిరసన శిబిరాన్ని సందర్శించిన ఆయన ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. విద్యార్థుల డిమాండ్లకు మద్దతు ప్రకటించారు.
మరోవైపు జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చెందిన ముగ్గురు సభ్యులు ఆదివారం రాజీనామా చేశారు. అజితా భట్టాచార్య, అనిమా హన్స్దా, జమాల్ అహ్మద్‌ల రాజీనామాలను గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆమోదించారు.
నియామక పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ, ఈడీ విచారణకు ఆదేశించింది. 14వ జేపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షతో పాటు 2023, 2025 బ్యాక్‌లాగ్ నియామక పరీక్షలను రద్దు చేయాలన్న విద్యార్థుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి సుదివ్య కుమార్ సోను తెలిపారు.
అయితే విద్యార్థులు మాత్రం సీబీఐ విచారణ జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సోమవారం జరిగే అసెంబ్లీ ముట్టడిని శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపారు. 16 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మహతోకు ఆదివారం వైద్య చికిత్స అందించారు.
