హైడ్రాకు మద్దతుగా నగరవాసుల ర్యాలీలు
చెరువులు, పార్కులు, నాలాలను కాపాడుతున్న హైడ్రాకు సంఘీభావం
పుప్పాలగూడ–నార్సింగి వద్ద 52.20 ఎకరాల చెరువు పరిరక్షణపై అభినందనలు
జనార్దన్‌హిల్స్‌లో వరద కాలువ, పార్కు పరిరక్షణకు మద్దతుగా భారీ ర్యాలీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ: చెరువులు, పార్కులు, నాలాలు, వరద కాలువలను పరిరక్షించేందుకు చర్యలు చేపడుతున్న హైదరాబాద్ విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ సంస్థ (హైడ్రా)కు మద్దతుగా నగరంలో ర్యాలీలు కొనసాగుతున్నాయి. పలు కాలనీల సంక్షేమ సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీల నివాసితులు, అపార్ట్‌మెంట్ వాసులు హైడ్రాకు సంఘీభావం ప్రకటిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చెరువులు, పార్కులు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాల్సిన అవసరం ఉందని, హైడ్రా వంటి వ్యవస్థ కొనసాగాలని వారు కోరుతున్నారు.

ఐటీ కారిడార్‌కు సమీపంలోని గండిపేట మండలం పుప్పాలగూడ–నార్సింగి సరిహద్దులో ఉన్న 52.20 ఎకరాల చెరువు పరిరక్షణకు హైడ్రా చర్యలు తీసుకోవడాన్ని పరిసర ప్రాంతాల ప్రజలు స్వాగతించారు. చెరువు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకున్నందుకు స్థానికులు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ వాసులు ర్యాలీలు నిర్వహించి తమ మద్దతు తెలిపారు.
ముష్కిన్ చెరువుకు రక్షణ
ముష్కిన్ చెరువు పరిధిలో సుమారు 35 ఎకరాల మేర ఆక్రమణలకు ప్రయత్నాలు జరిగాయని పేర్కొంటూ.. వాటిని తొలగించి చెరువును పరిరక్షించేందుకు హైడ్రా చర్యలు తీసుకుందని స్థానికులు తెలిపారు. చెరువుల పరిరక్షణతోనే భవిష్యత్‌లో వరద ముప్పును తగ్గించగలమని వారు అభిప్రాయపడ్డారు.
వరద కాలువ, పార్కు పరిరక్షణకు ర్యాలీ
గచ్చిబౌలిలోని జనార్దన్‌హిల్స్ కాలనీలో ఆక్రమణలకు గురైన వరద కాలువను పరిరక్షించడంతో పాటు దానికి ఆనుకుని ఉన్న పార్కును కాపాడినందుకు హైడ్రాకు మద్దతుగా ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. సీనియర్ సిటిజన్లు, మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైడ్రాను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి వారు సంఘీభావం ప్రకటించారు.
‘హైడ్రా ఉండాల్సిందే’
నగర భవిష్యత్ సురక్షితంగా ఉండాలంటే చెరువులు, పార్కులు, నాలాలు, వరద కాలువలను పరిరక్షించాల్సిందేనని ర్యాలీలో పాల్గొన్న పలువురు పేర్కొన్నారు. వరదలు లేని నగరం కావాలంటే సహజ నీటి వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చెరువుల ఆక్రమణలను అడ్డుకునే చర్యలకు తాము మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు.
హైడ్రా చర్యలపై నగరంలో అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో స్థానికుల మద్దతు కార్యక్రమాలు కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది.
