జైల్‌ భరోలో భాగంగా భీమ్‌గల్‌లో ర్యాలీ, రాస్తారోకో

భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక సంఘాలు ఇచ్చిన జైల్‌ భరో పిలుపులో భాగంగా భీమ్‌గల్‌ పట్టణంలో సోమవారం అంగన్‌వాడీ ఉద్యోగులు, సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కైరిదేవ గంగు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల గోవర్ధన్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్‌ మాట్లాడుతూ కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మిక కోడ్‌లను తీసుకురావడం సరికాదన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ఉపాధి హామీ చట్టాన్ని గత విధానంలోనే కొనసాగించాలని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని నాయకులు కోరారు. విత్తన చట్టాన్ని సవరించి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలని, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే కార్మిక, కర్షక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా నాయకులు జ్యోతి, ప్రమీల, లక్ష్మి, యమునతో పాటు పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.