చిత్తూరులో ఉద్రిక్తత..
- వైసీపీ నిరసన ర్యాలీ అడ్డుకున్న పోలీసులు
- విజయానందరెడ్డితో పాటు పలువురు నేతల అరెస్టు..
- పోలీస్‌స్టేషన్ ఎదుట కార్యకర్తల ఆందోళన
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు నగరంలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెగా డీఎస్సీ నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో గంగిరెడ్డిచెరువు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు.
ర్యాలీ ప్రారంభానికి ముందే గంగిరెడ్డిచెరువు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎస్పీ వెంకటనారాయణ, వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌నాయుడు, వన్‌టౌన్ సీఐ చిన్నపెద్దయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీకి అనుమతి లేదని, అనుమతి లేకుండా నిర్వహిస్తే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు వైసీపీ నాయకులను హెచ్చరించారు.

అయితే శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ నాయకులు కోరినప్పటికీ పోలీసులు నిరాకరించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు విజయానందరెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో చిత్తూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
విజయానందరెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టూటౌన్ పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ‘జై జగన్’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య మరోసారి వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా చిత్తూరు నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని, పార్టీ ఆదేశాల మేరకు సోమవారం గంగిరెడ్డిచెరువు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అయితే ర్యాలీ ప్రారంభించకముందే పోలీసులు తమను అడ్డుకుని అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలపై నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదని విజయానందరెడ్డి అన్నారు. ప్రభుత్వ హామీలను అమలు చేయాలని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగులకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేశారా అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి ఏమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అరెస్టులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరని, ఎన్ని అరెస్టులు చేసినా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని విజయానందరెడ్డి స్పష్టం చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
పోలీసులు ర్యాలీకి అనుమతి లేదని ముందుగానే స్పష్టం చేయడంతోనే బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు ప్రయత్నించిన తమను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో చిత్తూరు నగరంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
