ప్రశ్నిస్తున్న యువత.. దిగొస్తున్న ప్రభుత్వాలు!
కాక్రోచ్ ఉద్యమం నుంచి ఝార్ఖండ్ విద్యార్థుల ఆందోళనల వరకు..
సమస్యలపై యువతరం గళం
‘జెన్‌జీ’ మంత్రం జపిస్తున్న రాజకీయ పార్టీలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ‘నీ యవ్వన తేజంతో ప్రజాపోరు నడవాలి.. నీ రక్తం పుష్పించగా ఈ దేశం ఫలించాల’ని దిగంబర కవి చెరబండ రాజు అన్న వ్యాఖ్యాలు.. వాటిని నిజం చేస్తూ దేశంలోని యువత ప్రభుత్వాల తీరుపై ప్రజాపోరుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం జవాబుదారిగా ఉండాలని నిరసన బాట పడుతున్నాయి. ఢిల్లీ నుంచి ఝార్ఖండ్ దాకా యువతరం ప్రభుత్వాలను కడిగిపడేస్తున్నాయి. సగటు భారతీయుడి వయసు దాదాపు 30 ఏళ్లలోపే ఉండటం.. ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా కలిగిన దేశాల్లో భారత్ ముందువరుసలో ఉందని చెప్పడానికి నిదర్శనం. అదే చైనాలో సగటు వయస్సు 40ఏళ్లు, జపాన్ లో అయితే ఏకంగా 47 ఏళ్ల సగటు వయస్సు కలిగి ఉన్నాయి. కానీ భారత దేశం యువశక్తితో నిండిఉంది. 2026 అంచనాల ప్రకారం భారత్‌లో మధ్యస్థ వయసు 29.8 ఏళ్లు. ఇంతటి భారీ యువశక్తి ఉన్న దేశంలో.. వారి ఆలోచనలు, ఆకాంక్షలు, అసంతృప్తులు రాజకీయాలను ప్రభావితం చేయడం సహజమే. ఇప్పుడు అదే జరుగుతోందా? అన్న చర్చ మొదలైంది.
కాక్రోచ్ నుంచి ఝార్ఖండ్ దాకా..
యువత తలచుకుంటే మార్పు సాధ్యమేనన్న భావనకు ఇటీవలి పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. నీట్ సహా పోటీ పరీక్షల్లో అవకతవకలపై యువత నుంచి వచ్చిన ఆగ్రహం సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో పెద్ద ఉద్యమ రూపాన్ని తీసుకుంది. ఇది కేవలం రాజకీయ నినాదం కాదని, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, భవిష్యత్తుపై యువతలో ఉన్న ఆందోళనలకు ప్రతిబింబమని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరిగింది. సీజేపీ చేసిన అద్భుత పోరాట పటిమ ఫలితంగా ఏకంగా కేంద్రం దిగివచ్చింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం రాజీనామా చేసిన సంగతి తెలిసింది.. ఇక ఝార్ఖండ్‌లో జేపీఎస్సీ, జేఎస్సీ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు సాగిస్తున్న ఆందోళన మరింత ఉధృతమైంది. జేపీఎస్సీ పరీక్షల వ్యవహారంపై విద్యార్థుల నిరసనలు కొనసాగుతుండగా, ప్రభుత్వం కొన్ని జేపీఎస్సీ పరీక్షలను రద్దు చేసేందుకు అంగీకరించింది. అయితే జేఎస్సీ సీజీఎల్ పరీక్ష విషయంలో విద్యార్థులు వెనక్కి తగ్గలేదు.
యువత వైపు రాజకీయ చూపు
ఈ పరిణామాలు రాజకీయ పార్టీలను కూడా ఆలోచనలో పడేస్తున్నాయి. ఒకప్పుడు యువతను ఆకర్షించేందుకు ఉద్యోగాలు, ఉచిత పథకాలు, విద్య, క్రీడలు వంటి అంశాలను ముందుకు తెచ్చిన పార్టీలు.. ఇప్పుడు యువతతో నేరుగా సంభాషించే విధానాలపై దృష్టి పెడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇటీవల కేంద్ర మంత్రులు ఇన్‌స్టాగ్రామ్‌లో చురుగ్గా ఉండాలని, యువతతో అనుసంధానం కోసం రీల్స్, పరస్పర కార్యక్రమాలను ఉపయోగించాలని సూచించారు. ఏకంగా ప్రధానమంత్రే ఇన్స్టా రంగంలోకి దూకి రీల్స్ చేస్తూ యువతరానికి చేరువ అవుతున్నారు. యువత రోజువారీ జీవితంలో సామాజిక మాధ్యమాలు కీలకంగా మారిన నేపథ్యంలో రాజకీయ ప్రచారం కూడా అదే బాట పట్టడం ఆసక్తికర పరిణామం.
ఏపీలోనూ ‘కాక్రోచ్’ రాజకీయమేనా?
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ యువత ఉద్యమ ప్రభావం రాజకీయ చర్చల్లోకి వచ్చింది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తానూ ‘కాక్రోచ్‌నే’ అంటూ వ్యాఖ్యానించడం ద్వారా ఆ ట్రెండ్‌కు రాజకీయ రంగు అద్దారు. ఇలా దేశవ్యాప్తంగా యువత తమ సమస్యలపై ప్రశ్నించడం, నిరసన వ్యక్తం చేయడం, సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకోవడం కొత్త రాజకీయ వాస్తవికతను సూచిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, ధరలు, భవిష్యత్ ఉపాధి వంటి అంశాలు యువతను నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. యువతకు సంబంధించిన ఈ ఆందోళనలు రాజకీయ అజెండాలోకి రావడం సహజమే.
ఎన్నికల్లో యువ మంత్రం పనిచేస్తుందా?
ఇకపై ఎన్నికల్లో యువతను ఆకర్షించేందుకు కేవలం హామీలు సరిపోకపోవచ్చు. ఉద్యోగాలు కల్పిస్తారా? పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తారా? నైపుణ్యాలకు తగిన అవకాశాలు ఇస్తారా? తమ గొంతును వింటారా? అన్న ప్రశ్నలకు రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నేటి యువత కేవలం ఓటు బ్యాంకు కాదు.. ప్రశ్నించే ఓటరు కూడా. సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను క్షణాల్లో లక్షల మందికి చేరవేసే శక్తి వారికి ఉంది. అందుకే రాబోయే ఎన్నికల నాటికి ‘యువత’ అనే పదం కేవలం ప్రచార నినాదంగా కాకుండా.. రాజకీయ పార్టీల వ్యూహాలకు కేంద్రబిందువుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువతను ఎవరు మెప్పిస్తారు? వారి సమస్యలకు ఎవరు పరిష్కారం చూపుతారు? అన్నదే ఇక రాజకీయ పార్టీల ముందున్న అసలు పరీక్ష.
