సాగర్‌లో వరుణ యాగానికి హాజరైన రేవంత్‌రెడ్డి దంపతులు
తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో ప్రత్యేక యాగం
విజయ్ విహార్‌లో నిర్వహించిన వరుణ యాగంలో పాల్గొన్న ముఖ్యమంత్రి
కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలకు జలకళ రావాలని ప్రార్థనలు
నాగార్జునసాగర్, ఆంధ్రప్రభ: తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో నాగార్జునసాగర్‌లో నిర్వహించిన వరుణ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ యాగంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి.. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలు జలకళను సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగాన్ని నిర్వహించారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి అనుకూల పరిస్థితులు ఏర్పడాలని, సాగునీటి వనరులు నిండాలని ఈ సందర్భంగా ప్రార్థనలు చేశారు.

108 మంది రుత్వికులతో యాగం
విజయ్ విహార్ ప్రాంగణంలో 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో వరుణ యాగాన్ని నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో యాగ కార్యక్రమాలు కొనసాగాయి. పూర్ణాహుతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, సకాలంలో వర్షాలు, జలవనరుల సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు లేకుండా.. చెరువులు, రిజర్వాయర్లు నిండి రైతులకు సాగునీరు అందుబాటులోకి రావాలని యాగం ద్వారా ఆకాంక్షించారు. రాష్ట్ర సుభిక్షత, ప్రజల సంక్షేమం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

