పశ్చిమ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ..
సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో వానలకు అవకాశం
హైదరాబాద్‌లో సాయంత్రం వరకు వేడి, పొడి వాతావరణం..
రాత్రికి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో సోమవారం పగటి వేళ వర్షాల తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. రాత్రి సమయానికి వర్షాలు ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో రాత్రి వేళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట జిల్లాల్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో రాత్రి వేళ వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లోనూ రాత్రికి వర్షం
రాజధాని హైదరాబాద్‌లో సాయంత్రం వరకు ప్రధానంగా వేడి, పొడి వాతావరణం కొనసాగనుంది. మధ్యలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. అయితే రాత్రి వేళ నగరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా. మొత్తంగా రాష్ట్రంలో పగటి సమయంలో వర్ష కార్యకలాపాలు పరిమితంగా ఉన్నప్పటికీ.. రాత్రి వేళ పశ్చిమ తెలంగాణతో పాటు హైదరాబాద్‌లో వర్షాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో రాత్రి ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండటం మంచిది.
