కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల రాస్తారోకో
మోత్కూర్, ఆంధ్రప్రభ: కార్మికులు, రైతులు, పేదల ప్రయోజనాలను దెబ్బతీసే జీ రామ్ జీ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో మోత్కూర్ అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లు యాదగిరి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కులపై దాడి చేస్తోందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థల లాభాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరుస్తూ, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్మిక కోడ్లను తీసుకొచ్చారని ఆరోపించారు.
దేశంలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తూ గ్రామీణ పేదల జీవనోపాధిని దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, రైతుల పంటలకు ప్రభుత్వ కొనుగోలు హామీ కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు ఏర్పాటు చేయడం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడమేనని అన్నారు. రుణాలు, ఎరువులు, విత్తనాల సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, భారత వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు మెంట యల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు రాచకొండ రాములమ్మ, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకటనర్సు, రైతు సంఘం జిల్లా నాయకుడు పైళ్ల యాదిరెడ్డి, మండల కార్యదర్శి దడిపల్లి ప్రభాకర్, చేనేత నాయకులు కూరపాటి రాములు, కందుకూరి నర్సింహా, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
