డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి..
- డీఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలి
- వైకాపా ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
- వైకాపా నాయకుల పై లాఠీచార్జి చేసిన పోలీసులు
- ఆర్డీవోకు వినతిపత్రం అందజేసిన ఎంపీ
పులివెందుల అర్బన్, ఆంధ్రప్రభ : డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, పేపర్ లీకేజీపై ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పులివెందులలో ర్యాలీ నిర్వహించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎస్.వి. సతీష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అందించాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు న్యాయం చేయాలని శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదని వైసీపీ నాయకులు విమర్శించారు. ర్యాలీ వెంకటేశ్వరస్వామి ఆలయం మీదుగా పగలగొట్టిన బస్టాండ్ వరకు చేరుకుంది. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబకపల్లి రోడ్డు మీదుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు.
ఆర్డీవో కార్యాలయం వద్ద తోపులాట
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆర్డీవో కార్యాలయంలోకి వెళ్తుండగా నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట వెళ్లేందుకు ప్రయత్నించారు. ఒకేసారి ఎక్కువ మంది లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు సూచించడంతో కొంతసేపు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు డీఎస్పీ, సీఐల ఆధ్వర్యంలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
అనంతరం ఎంపీ అవినాష్‌రెడ్డి వైసీపీ నాయకులతో కలిసి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి పాలనను గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేశామని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని అవినాష్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని, ప్రజలు ఆ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
