డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో రగడ
జై కేసీఆర్.. జై కాంగ్రెస్ నినాదాలతో సభలో గందరగోళం
కౌశిక్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చిన మంత్రులు పొన్నం, పొంగులేటి
కమలాపూర్, ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రుల పర్యటన సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. మండలంలోని గూడూరు, మరిపల్లిగూడెం, కమలాపూర్ గ్రామాల్లో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన 402 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంతో పాటు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం స్థానిక ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నినాదాలు మార్మోగాయి.
వెంటనే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని గాలికి వదిలేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని కౌశిక్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
అయినప్పటికీ సభలో కార్యకర్తలు జై కేసీఆర్, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేయడంతో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.
