Gold-Price-Today-August-10-2026-24k-22k-Mcx-Gold-Futures | తగ్గిన బంగారం ధర.. కానీ మార్కెట్‌లో మళ్లీ జోరుకు సంకేతాలు!

  • 24 క్యారెట్ల బంగారం రూ.15,197.. 22 క్యారెట్లు రూ.13,930
  • అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ 4,340 డాలర్ల దిగువన..
  • MCXలో మాత్రం 10 గ్రాములు రూ.1.52 లక్షల పైకి
  • డిజిటల్ గోల్డ్ ధరలు మాత్రం ప్లాట్‌ఫామ్‌ను బట్టి మార్పు

Gold-Price-Today-August-10-2026-24k-22k-Mcx-Gold-Futures | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, బిజినెస్ ప్ర‌తినిధి : బంగారం ధరలు వరుసగా పెరిగిన తర్వాత ఈ రోజు (10-08-2026న‌) స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.15,197, 22 క్యారెట్ల బంగారం రూ.13,930గా ట్రేడింగ్ అవుతుంది. గత రోజుతో పోలిస్తే 24Kపై రూ.38, 22Kపై రూ.35 తగ్గింది.

జాతీయ మార్కెట్‌లో
దేశీయ స్పాట్/రిటైల్ మార్కెట్‌కు భిన్నంగా కమోడిటీ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ (MCX), భవిష్యత్‌లో బంగారం ధర ఎలా ఉండొచ్చో అంచనా (Gold Futures ) ప్ర‌కారం 10 గ్రాములకు రూ.1,52,737 వద్ద ట్రేడయ్యాయి. గత ముగింపుతో పోలిస్తే రూ.917, అంటే సుమారు 0.6% పెరుగుదల కనిపించింది. అదే సమయంలో రోజు కనిష్ఠం రూ.1,51,461, గరిష్ఠం రూ.1,52,842 మ‌ధ్య ట్రేడ్ అవుతుంది.

అంటే ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన పరిస్థితి ఉంది. రిటైల్ బంగారం ధరలు కొద్దిగా తగ్గుతుండగా, MCX ఫ్యూచర్స్ మాత్రం ధ‌ర పెరుగుతున్న‌ది. ఇది అంతర్జాతీయ ధరలు, రూపాయి మారకం విలువ, దేశీయ డిమాండ్, ఫ్యూచర్స్ మార్కెట్‌లో కొనుగోళ్ల ప్రభావాన్ని చూపుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఎంత?
అంతర్జాతీయ మార్కెట్‌లో Spot Gold ఔన్స్ (31.10 గ్రాములు) ధ‌ర‌ సుమారు $4,340–$4,350 మ‌ధ్య ట్రేడింగ్ అవుతుంది. అంత‌ర్జాతీయ మార్కెట్ ధ‌ర ప్ర‌తి గంట‌కు మారుతుంటాయి. ఇదే స‌మ‌యానికి ఔన్స్‌ ధర $4,339.77 ఉంది. నిన్న‌టితో పోలిస్తే 0.08% తక్కువగా ఉంది. నెల రోజుల వ్యవధిలో సుమారు 8.45%, ఏడాది వ్యవధిలో దాదాపు 29.82% పెరిగింది. మరో లైవ్ మార్కెట్ డేటా ప్రకారం $4,313–$4,352గా ఉంది. Spot Gold అంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం బంగారం కొనుగోలు/అమ్మకానికి ఉన్న తక్షణ మార్కెట్ ధర. ఇది డాలర్లలో ఒక్క ట్రాయ్ ఔన్స్‌కు చూపిస్తారు. సుమారుగా $4,340 స్పాట్ ధరను, ప్రస్తుత డాలర్-రూపాయి మారకం విలువను తీసుకుంటే, భారతీయ రూపాయల్లో పన్నులు, దిగుమతి వ్యయాలు, ప్రీమియం లేకుండా సుమారు రూ.1.33 లక్షలు/10 గ్రాముల స్థాయి వస్తుంది. అందుకే అంతర్జాతీయ స్పాట్ ధర కంటే భారతదేశంలోని రిటైల్ ధర ఎక్కువగా ఉంటుంది.

డిజిటల్ గోల్డ్ ధర ఎంత?
డిజిటల్ గోల్డ్‌కు దేశవ్యాప్తంగా ఒకే ధర ఉండదు. వివిధ‌ ప్రొవైడర్లు అంతర్జాతీయ/దేశీయ మార్కెట్ ధరలను ఆధారంగా చేసుకుని తమ లైవ్ కొనుగోలు ధర, విక్రయ ధరను నిర్ణయిస్తారు. అందువల్ల ఒక యాప్‌లో కనిపించే ధర మరో యాప్‌లో కొద్దిగా భిన్నంగా ఉండొచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో 24K భౌతిక బంగారం సూచిక ధర సుమారు రూ.15,197/గ్రాము. డిజిటల్ గోల్డ్ కొనుగోలు ధరలో GST, ప్లాట్‌ఫామ్ స్ప్రెడ్ వంటి అంశాలు ఉండటంతో యాప్‌లో కనిపించే తుది ధర దీనికంటే ఎక్కువగా ఉండవచ్చు.

గత 10 రోజుల్లో బంగారం ప్రయాణం.. ఒక్కసారి చూస్తే!
హైదరాబాద్‌లో 24K బంగారం ఆగస్టు 1న రూ.14,422/గ్రాము ఉండగా, ఆగస్టు 6న రూ.14,973కు, ఆగస్టు 7న రూ.15,126కు చేరింది. ఆగస్టు 8న రూ.15,235 వద్దకు వెళ్లింది. ఆగస్టు 10న రూ.15,197కు స్వల్పంగా తగ్గింది. అంటే కేవలం పది రోజుల్లోనే గ్రాముకు సుమారు రూ.775 పెరుగుదల కనిపించింది.