ఖిలా వరంగల్‌లో స్వాతంత్య్ర వేడుకలు..

  • జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
  • సమరయోధులకు ఘన సత్కారం.. ఇళ్ల మంజూరుకు హామీ
  • దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు

వరంగల్‌ కలెక్టరేట్‌, ఆంధ్రప్రభ : చారిత్రక ఖిలా వరంగల్‌లోని ఖుషీ మహల్‌ ప్రాంగణంలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

వేడుకలకు హాజరైన మంత్రి కొండా సురేఖ ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాలను ఆలపించారు. అనంతరం పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన పోలీసు పరేడ్‌ను మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులను మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా తమకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించాలని సమరయోధులు కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించి ఇళ్ల మంజూరుకు హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులకు మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందించారు.

ప్రభుత్వ వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) జి. సంధ్యారాణి, అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) వై.వి. గణేష్‌ తదితరులు పరిశీలించారు.

ఈ వేడుకల్లో జిల్లా డీసీపీ అంకిత్‌ కుమార్‌, డీఎఫ్‌ఓ నిఖిత, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.