- ఒంటరి మహిళలే టార్గెట్..
- వీరిపై 25కు పైగా కేసులు..
- రూ.30లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం..
- తగ్గుముఖం పడుతున్న ప్రాపర్టీ దొంగతనాలు..
- సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ.. సీపీ రాజశేఖర్ బాబు..
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకుని వారి మెడలో బంగారు ఆభరణాలను లాక్కుని వెళ్ళే ముఠా సభ్యులకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. జల్సాలకు, చెడు అలవాట్లకు బానిసైన కొందరు ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న నలుగురు నిందితులను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే వీరిపై వివిధ ప్రాంతాల్లో 25కు పైగా కేసులు ఉండగా, వీరి వద్ద నుండి రూ.30 లక్షల విలువైన సుమారు 500 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
సులభంగా డబ్బు సంపాదించాలని..
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ ముఠా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతుంది. నెల్లూరు జిల్లాకు చెందిన అచ్చి గిరిబాబు, అచ్చి మహేష్, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దొనబండకు చెందిన గాలేటి వెంకటరమణ, అతని చెల్లెలు కొండపల్లికి చెందిన మొగిలి సంధ్య ముఠాగా ఏర్పడి ఒంటరిగా ఉన్న మహిళల మెడలో బంగారు ఆభరణాలు లాక్కుని వెళ్లిపోవాలని నిర్ణయించుకుని ఒక యూనికాన్ బైక్ తో ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో తిరుగుతూ అదును చూసుకుని ఒంటరి అర్ధ వయసు మహిళలు కనబడితే వారి మెడలోని చైన్లను లాక్కెళ్తున్నారు. ఇలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో 12 చైన్స్ స్నాచింగ్ చేసి జైలుకు వెళ్లి తిరిగివచ్చి కూడా దొంగతనాలు చేయడం ప్రారంభించారు. దొంగతనం అనంతరం ఆభరణాలు అమ్మి వచ్చే డబ్బుతో జల్సాలు చేస్తూ వస్తున్నారు. వీరిపై ఇబ్రహీంపట్నం 2, జగ్గయ్యపేట 3, మైలవరం 4, తిరువూరు 3 పోలీస్ స్టేషన్లలో మొత్తంగా 12 కేసులు ఉండగా, కృష్ణా జిల్లా పరిధిలో 4, ఏలూరు జిల్లా పరిధిలో 2, తెలంగాణ రాష్ట్రంలో 7 చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి. వరుస దొంగతనాల నేపథ్యంలో పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన జిల్లా పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో వీరందరిని ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం బస్ స్టాప్ వద్ద వాహనాల తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా పారిపోతూ కనిపిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వీరి వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రాపర్టీ దొంగతనాలపై గట్టి నిఘా…
జిల్లా వ్యాప్తంగా ప్రాపర్టీ దొంగతనాలపై గట్టిగా నిఘా ఏర్పాటు చేశామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు తెలిపారు. 3500 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్న ఆయన గత ఏడాదితో పోల్చి చూస్తే దొంగతనాలు తగ్గుముఖం పట్టాయన్నారు. 2024 సంవత్సరంలో 457 దొంగతనాలు ఇదే సమయానికి నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 365 కేసులు నమోదు అయినట్లు, ఇందులో 185 మోటార్ సైకిల్ దొంగతనాలకు సంబంధించి 196 మోటార్ సైకిళ్లు చోరీ కాగా, 136 బైకులు పట్టుకున్నట్లు చెప్పారు. బైకులు దొంగతనం జరిగే ప్రాంతాలను గుర్తించామన్న ఆయన ఎక్కువగా కృష్ణలంక పరిధిలో బస్టాండ్, రైల్వే స్టేషన్ తో పాటు భవానిపురం కొండ ప్రాంతాల్లో వాహనాలు దొంగతనం జరుగుతున్నాయన్నారు. జిల్లాలో ఎక్కడ బైక్ దొంగతనాలు జరిగినా, బైక్ దొరకకుండా పోయే ఆస్కారమే లేదన్నారు. వాహనదారులందరూ తప్పనిసరిగా కాస్త ఖర్చుతో కూడినది అయినప్పటికీ జీపీఆర్ఎస్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

సిబ్బందికి అభినందనలు…
చైన్ స్నాచింగ్ ముఠా కోసం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు బృందాలను ఏర్పాటు చేసి, అనుమానితుల కదలికలపై అప్రమత్తంగా ఉండి, వీరిని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన ఏడీసీపీ ఎం రాజారావు, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఇన్ స్పెక్టర్లు, ఎస్ఐలు బాలయ్య స్వామి సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ రవి, కానిస్టేబుళ్లు మిథున్, సురేష్, షబ్బీర్, రమణలను సీపీ రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.
గంజాయిపై ఉక్కు పాదం…
ప్రస్తుతం జిల్లాలో గంజాయి జాడ చాలా వరకు తగ్గుముఖం పట్టిందని, కొందరు కరుడుగట్టిన నేరస్తులు మాత్రం బృందాలుగా ఏర్పడి, నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని సెల్ ఫోన్లు, బైక్ లు దొంగతనం చేసి ఒరిస్సా ప్రాంతంలో అమ్మి గంజాయి ఇక్కడికి తీసుకువచ్చి అమ్ముతున్నట్లుగా గుర్తించామని సీపీ రాజశేఖర్ బాబు వివరించారు. గంజాయి కోసమే బైకు దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లు, సెల్ఫోన్ దొంగతనాలు చేస్తున్నారని, వీరిపై గట్టిగా నిఘా పెట్టినట్లు చెప్పారు. కొంతమంది ఒరిస్సా వెళ్లి గంజాయి కొనుగోలు చేస్తున్న వారిపై పీఐటీ యాక్ట్ పెట్టి కటకటాల్లో వేస్తున్నామన్న ఆయన, వీరిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.