Urea | అక్రమల కట్టడికే యాప్ ద్వారా యూరియా విక్రయం

Urea | ఎడపల్లి, ఆంధ్రప్రభ : రైతులు సాంకేతికతను అందిపుచ్చుకుని సాగులో ముందడుగు వేయాలని మండల వ్యవసాయ అధికారి (ఏఓ) సిద్దిరమేశ్వర్ సూచించారు. ఆదివారం ఠాణాకలాన్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) లో రైతులకు ఆన్లైన్ ద్వారా యూరియా బుకింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. స్మార్ట్ఫోన్లలో ప్లే స్టోర్ నుండి సంబంధిత యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అందులో యూరియా కోసం ఎలా బుక్ చేసుకోవాలనే అంశాలను ఆయన ప్రత్యక్షంగా రైతులకు అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు యూరియా సులభంగా అందేలా “ఫర్టిలైజర్ యాప్”ను ప్రవేశపెట్టిందన్నారు.

ఈ యాప్ ద్వారా రైతులు ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చు. యూరియా బుకింగ్‌కు రైతులు తమ పట్టాదార్ పాస్‌బుక్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఉపయోగించి నమోదు చేసుకోవాలన్నారు. ఈ యాప్ ద్వారా యూరియా పంపిణీలో పారదర్శకత పెరుగుతుందన్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు.  రైతులు తమ భూమి విస్తీర్ణం ఆధారంగా యూరియా బుక్ చేసుకోవచ్చన్నారు. ఎకరం వరి పంటకు 3 బస్తాలు, మొక్కజొన్నకు 4 బస్తాలు, ఇతర పంటలకు 2 బస్తాల యూరియా తీసుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply