ఒడిశా నుంచి గంజాయి.. మేడ్చల్‌లో భారీ పట్టివేత!

​మేడ్చల్, ఆంధ్రప్రభ: మహారాష్ట్రకు చెందిన ఇద్దరు గంజాయి రవాణాదారులను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.లక్షల విలువైన 5.849 కిలోల గంజాయితో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర రాష్ట్రంలోని జాల్నా జిల్లాకు చెందిన సచిన్ సంతోష్ జాదవ్ (24), రాజేష్ మాధవ్ చౌదరి (22) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశా నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణలో విక్రయించేందుకు పథకం రచించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ పోలీసులు గురువారం మేడ్చల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్-6 సమీపంలోని ధ్రువ కాలేజీ రోడ్డులో నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి నల్లటి బ్యాగులో దాచిన 5.849 కిలోల గంజాయి లభ్యమైంది.

దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఈ గంజాయి రవాణా నెట్‌వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు, కొనుగోలుదారుల కోసం పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.