సత్యం, ధర్మం, త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్

విజయవాడ, ఆంధ్రప్రభ : మొహరం (పీర్ల పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్రమైన రోజున నియోజకవర్గ పరిధిలో స్థానిక రాయల్ హోటల్ సెంటర్ వద్ద ఖాన్ దర్బార్ వైస్సార్సీపీ 53వ డివిజన్ అధ్యక్షుడు గురుమహంత్ మహేష్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొని మైనారిటీ సోదరులకు షర్బత్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ మొహరం అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది సత్యం, ధర్మం త్యాగానికి నిలువెత్తు రూపమని కొనియాడారు. అన్యాయంపై న్యాయం సాధించిన విజయానికి, ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన మహోన్నత త్యాగానికి ఈ మొహరం చిహ్నమని పేర్కొన్నారు. ఆయన చూపిన త్యాగనిరతి,శాంతి మార్గం నేటి సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమని తెలిపారు.పశ్చిమ నియోజకవర్గంలో హిందూ-ముస్లిం భాయ్-భాయ్ అంటూ అందరూ కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవడం ఇక్కడి గంగా-జమునా తెహజీబ్ (మతసామరస్య సంస్కృతి)కి అద్దం పడుతోందని హర్షం వ్యక్తం చేశారు.

ప్రస్తుత ఎండ తీవ్రతలో ఉన్న ప్రజలకు ఈ చల్లని షర్బత్ ఎలా ఉపశమనాన్ని ఇస్తుందో అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం ఎల్లప్పుడూ మైనారిటీల జీవితాల్లో చల్లదనాన్ని, భరోసాను నింపుతుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. జగనన్న ప్రభుత్వ హయాంలో మైనారిటీల సంక్షేమానికి,వారి హక్కుల రక్షణకు,ఆర్థిక అభ్యున్నతికి ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా పశ్చిమ నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ, వారి పండుగలకు,వారి సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, డివిజన్ ఇంచార్జ్‌లు, అనుబంధ విభాగాల ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.