నిరుపేదల మోకీళ్ల మార్పిడికి ‘ఉన్నతి’ చేయూత
- జీజీహెచ్‌లో 100 శస్త్రచికిత్సలు
- రూ.కోటి విలువైన ఇంప్లాంట్లు, సాంకేతిక పరిజ్ఞానం
- గతంలో 125 మందికి విజయవంతంగా కీలు మార్పిడి
- ఒక్క కేసులోనూ ఇన్ఫెక్షన్ లేకుండా
- దశాబ్దం తర్వాత కోలుకున్న రోగులతో వైద్యుల ముఖాముఖి..
- నృత్యాలు, కోలాటాలతో సందడి
విజయవాడ, ఆంధ్రప్రభ: నిరుపేదలకు ఉచితంగా మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు అందించేందుకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)కి ‘ఉన్నతి ఫౌండేషన్’ భారీగా చేయూత అందించనుంది. సుమారు రూ.కోటి విలువైన ఇంప్లాంట్లు, అవసరమైన పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉన్నతి ఫౌండేషన్ చైర్మన్, సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.దుర్గాప్రసాద్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
గతంలో ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీజీహెచ్‌లో 125 మంది నిరుపేదలకు ఉచితంగా మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్ నరేంద్రరెడ్డి తెలిపారు. అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అందించిన స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ప్రస్తుతం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, సూపరింటెండెంట్ డాక్టర్ జి.దుర్గాప్రసాద్ విజ్ఞప్తి మేరకు మరో 100 శస్త్రచికిత్సలకు అవసరమైన ఇంప్లాంట్లు, పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నట్లు వెల్లడించారు.
తాను స్వయంగా జీజీహెచ్‌కు వచ్చి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తానని తెలిపారు. గతంలో శస్త్రచికిత్సలు చేయించుకున్న 125 మంది రోగులు, వారి కుటుంబ సభ్యులతో బుధవారం జీజీహెచ్ ఎంసీహెచ్ బ్లాక్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. దశాబ్దం క్రితం మోకీళ్ల మార్పిడి చేయించుకున్న వారు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తూ, వైద్యులతో కలిసి నృత్యాలు, కోలాటాలతో సందడి చేశారు. తమకు నొప్పిలేని నడకను అందించిన డాక్టర్ నరేంద్రరెడ్డి, జీజీహెచ్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి మాట్లాడుతూ 125 మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల్లో ఒక్కరికి కూడా ఇన్ఫెక్షన్ రాకపోవడం సర్జన్ అంకితభావానికి నిదర్శనమన్నారు. శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు ఆనందంగా నృత్యాలు, కోలాటాలు చేయడం చూసి సంతోషం వ్యక్తం చేశారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నిరుపేదలకు ఉచితంగా శస్త్రచికిత్సలు అందించేందుకు డాక్టర్ నరేంద్రరెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ కీలు మార్పిడి శస్త్రచికిత్సలకు ఆసుపత్రి తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ పి.అనిల్‌బాబు, ప్రొఫెసర్లు డాక్టర్ ఎ.అజయ్, డాక్టర్ కె.శ్రీనివాసరావు, బీఎంఆర్ గ్రూప్స్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, డాక్టర్ బూసిరెడ్డి దీప్తిరెడ్డి, డాక్టర్ బూసిరెడ్డి ఉన్నతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
