లక్ష ఇళ్లపై జాతీయ జెండా

  • ‘నేను–నా దేశం.. ధర్మం కోసం–దేశం కోసం’ నినాదంతో ఎంహెచ్‌పీఎస్‌ కార్యక్రమం
  • 65 నియోజకవర్గాల్లో ముస్లింల భాగస్వామ్యంతో జెండాల పంపిణీ
  • ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా నమోదు
  • పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు

విజయవాడ, ఆంధ్రప్రభ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘నేను–నా దేశం.. ధర్మం కోసం–దేశం కోసం’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లకు జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌ షుబ్లీ తెలిపారు. బుధవారం మొఘల్‌రాజపురంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన సమితి రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఫారూఖ్‌ షుబ్లీ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని మతపెద్దలు ఇచ్చిన ఫత్వాను అనుసరించి పలువురు ముస్లింలు ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల్లో ముస్లింలు కార్యక్రమంలో భాగస్వాములై తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా ఎంహెచ్‌పీఎస్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. యాప్‌ ద్వారా నమోదు చేసుకున్న వారికి సమితి సభ్యత్వంతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆన్‌లైన్‌ ప్రశంసా పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్రంలోని 65 నియోజకవర్గాలకు చెందిన ఎంహెచ్‌పీఎస్‌ ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.