ఆర్టీసీ బస్సు–బొలెరో ఢీ

  • ముగ్గురికి తీవ్ర గాయాలు
  • నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

గడివేముల, ఆంధ్రప్రభ: మండలంలోని తిరుపాడు గ్రామ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నంద్యాల నుంచి ఉండుట్ల గ్రామానికి వెళ్తుండగా తిరుపాడు గ్రామ సమీపంలో బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గడిగరేవుల గ్రామానికి చెందిన వెంకటరమణ, మంచాలకట్ట గ్రామానికి చెందిన వసంతమ్మ, దుర్వేసి గ్రామానికి చెందిన నాగలక్ష్మి గాయపడ్డారు.

క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ ద్వారా మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను పరిశీలించారు. ఇదే సమయంలో గడివేముల నుంచి పాణ్యం వెళ్తున్న వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రమాద విషయం తెలుసుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని 108 అంబులెన్స్‌ సిబ్బందిని కోరారు.