కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో పొంగులేటి భేటీ…

  • 11.56 లక్షల ఇళ్లు మంజూరు చేయాల‌ని విజ్ఞప్తి
  • తెలంగాణ పర్యటనకు ఆహ్వానం

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణలోని పేదలకు గృహ వసతి కల్పించేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (పీఎంఏవై–జీ 2.0) కింద 11,56,915 ఇళ్లను ఒకేసారి కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాసిన లేఖను గుర్తుచేస్తూ.. తెలంగాణకు ఇళ్ల కేటాయింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

ఏడాది క్రితమే సర్వే పూర్తి.. ఇంకా కేటాయింపులు లేవు

తెలంగాణలో ‘ఆవాస్‌ ప్లస్‌–2024’ యాప్‌ ద్వారా ఇంటింటి సర్వేను పారదర్శకంగా నిర్వహించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ సర్వేలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 11.56 లక్షలకుపైగా పేద కుటుంబాలు గృహ నిర్మాణ సాయానికి అర్హులుగా గుర్తించబడ్డాయని చెప్పారు. అర్హతల పరిశీలన, అనర్హుల తొలగింపు ప్రక్రియ కూడా ఏడాది క్రితమే పూర్తయిందని, అయినప్పటికీ కేంద్రం నుంచి లక్ష్యాల కేటాయింపు ఆలస్యమవుతోందని వివరించారు. గత 12 ఏళ్లుగా తెలంగాణలో పేదల ఇళ్ల నిర్మాణం నిలిచిపోవడంతో భారీగా పెండింగ్‌ డిమాండ్‌ ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన వారందరికీ ఒకే విడతలో ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం

రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని చారిత్రక నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఇది కేంద్ర సహాయం, పీఎంఏవై కింద వచ్చే రాష్ట్ర వాటాకు అదనంగా ఉంటుందని చెప్పారు. ఇందుకు అవసరమైన నిధులను రాష్ట్ర బడ్జెట్‌లో ఇప్పటికే కేటాయించినట్లు వెల్లడించారు.

కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను తెలంగాణ పర్యటనకు మంత్రి పొంగులేటి ఆహ్వానించారు. ఆయన స్వయంగా రాష్ట్రానికి వచ్చి పీఎంఏవై–జీ 2.0 కింద ఇళ్ల కేటాయింపులను ప్రకటిస్తే గ్రామీణ పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పొంగులేటి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్ తెలంగాణకు వచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, వేమ్ నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, సురేశ్‌ శెట్కర్‌, రామసహాయం రఘురాంరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌తో పాటు తెలంగాణ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.