సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు
- ఎల్కతుర్తి ఎస్‌ఐ నరసింహారావు హెచ్చరిక
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : సోషల్ మీడియా గ్రూపుల్లో ఇతరులను కించపరిచేలా, వ్యక్తిగతంగా దూషించే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎల్కతుర్తి ఎస్‌ఐ నరసింహారావు హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా, అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు, సందేశాలు షేర్ చేయకూడదని సూచించారు.
వివాదాస్పద, అసభ్యకర, దూషణాత్మక కంటెంట్‌ను పోస్టు చేసే వారితో పాటు ఆయా గ్రూపుల నిర్వాహకులపై కూడా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ఎస్‌ఐ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
