నల్లగండ్ల చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభం
- రైతులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
సంగారెడ్డి జిల్లా, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నల్లగండ్ల చెరువు పునరుద్ధరణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ రైతులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.
నల్లగండ్ల చెరువు మొత్తం విస్తీర్ణం 90 ఎకరాలు కాగా, ఇందులో 70 ఎకరాల వరకు రైతులకు చెందిన పట్టా భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉండటంతో పూర్తి స్థాయిలో చెరువు అభివృద్ధికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
చెరువు అభివృద్ధికి సహకరిస్తామని పేర్కొంటూ రైతులంతా సంతకాలు చేసి గతంలోనే హైడ్రాకు వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో పునరుద్ధరణ పనుల ప్రారంభ కార్యక్రమంలో కూడా రైతులు భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా రైతులు తమకు టీడీఆర్ కింద ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్‌ను కోరారు. అలాగే చెరువు కట్టపై ఉన్న పురాతన అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించుకునేందుకు వీలుగా కొంత అదనపు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో హైడ్రా అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య, హైడ్రా అదనపు కమిషనర్ డి. ఆనంద్‌కుమార్, ఏసీపీలు పుప్పాల తిరుమల, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు చెరువు చుట్టూ తిరిగి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పలు సూచనలు చేశారు.
చెరువును ఆహ్లాదకర ప్రాంతంగా తీర్చిదిద్దండి
నల్లగండ్ల చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 90 ఎకరాలు కాగా, ఆక్రమణల తొలగింపుతో అదనంగా 13 ఎకరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎఫ్టీఎల్, బఫర్ ప్రాంతాలతో కలిపి మొత్తం 103 ఎకరాల మేర చెరువును హైడ్రా అభివృద్ధి చేయనుంది.
చెరువు అభివృద్ధిలో భాగంగా ఇన్లెట్లు, ఔట్లెట్ల నిర్మాణం, పరిసరాల అభివృద్ధి, పచ్చదనం పెంపు వంటి పనులు చేపట్టనున్నారు.
చెరువు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాట్స్ డైరెక్టర్ యూనస్.. చేపట్టాల్సిన పనుల వివరాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు వివరించారు.
చెరువుకు ఒక వైపు సెంట్రల్ యూనివర్సిటీ ఉండటంతో అటు వైపు నుంచి భారీగా వరద నీరు వస్తుందని, ఆ నీరు సులభంగా చెరువులోకి చేరేలా ఇన్లెట్లను అభివృద్ధి చేయాలని కమిషనర్ సూచించారు.
చెరువు చుట్టూ పచ్చని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, పేరుకుపోయిన పూడికను తొలగించడంతో పాటు చెరువును మరింత లోతుగా తవ్వి అధిక నీటి నిల్వకు అవకాశం కల్పించాలని ఆదేశించారు.
చెరువు అభివృద్ధికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని హైడ్రా కమిషనర్ అన్నారు. టీడీఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చెరువు కట్టపై ఉన్న అమ్మవారి ఆలయానికి అవసరమైన స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. చెరువు పరిసర ప్రాంతాల్లోని అపార్ట్మెంట్ వాసులు కూడా పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై హైడ్రా చేపడుతున్న చర్యలను అభినందించారు.
నల్లగండ్ల చెరువు పరిసరాలు ఆహ్లాదకరంగా మారేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ అధికారులను ఆదేశించారు.
