విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, ఆంధ్రప్రభ : పొలంలో పచ్చిగడ్డి కోస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దండ గ్రామానికి చెందిన గోదాటి సైదులు (45), తండ్రి వెంకన్న కౌలుకు తీసుకున్న పొలంలో పచ్చిగడ్డి కోసేందుకు వెళ్లాడు. గడ్డి కోస్తున్న సమయంలో విద్యుత్ మోటార్‌కు సంబంధించిన వైరు కొడవలికి తగిలి తెగిపోవడంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవాహం ఏర్పడింది.
దీంతో సైదులుకు తీవ్ర విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
మృతుడి భార్య రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. సైదులు కౌలు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న సైదులు ఆకస్మికంగా మృతి చెందడంతో భార్య, కుమార్తెలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల రోదనలు గ్రామంలో విషాదాన్ని నింపాయి.
పొలాల్లో విద్యుత్ మోటార్లకు సంబంధించిన వైర్లు, పరికరాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులు సూచించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
