మార్కెట్ పతనాల సమయంలో…

మార్కెట్ పతనాల సమయంలో…
SIPలను ఆపడం పెట్టుబడిదారులు చేసే అత్యంత ఖరీదైన తప్పు ఎందుకు?
నిమేష్ చందన్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, బజాజ్ ఫిన్‌సర్వ్ AMC
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : 2023 డిసెంబర్‌లో భారతదేశంలోని నిఫ్టీ 50 సూచీ తొలిసారిగా 21731 వద్ద కొత్త గరిష్ఠాన్ని చేరింది, నెలలోపల 21801 గరిష్ఠాన్ని తాకింది. 2026 మార్చి చివరికి మనం ఆ స్థాయికి చాలా దగ్గరగా ఉన్నాం. ముఖ్యంగా విస్తృత మార్కెట్‌లోని అనేక స్టాక్స్ ఇప్పటికీ 2023 డిసెంబర్ స్థాయి కంటే తక్కువలో ఉన్నాయి. మార్కెట్ పతనాన్ని ఉపయోగించుకోవాలని అనుకున్న వారు తమ అభిప్రాయాన్ని మార్చుకుని, ఇంకా కొంతకాలం వేచి ఉండాలని అనుకున్నారు.
ఇది నాకు ఆశ్చర్యం కలిగించింది. 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నవారు ఇలా ఎందుకు అనుకుంటున్నారు? గత రెండు దశాబ్దాల్లో భారీ మార్పులు, పతనాలు ఎన్నో చూశాం. ఖచ్చితంగా వారు గత శతాబ్దంలో జరిగిన మార్కెట్ పతనాల గురించి కూడా చదివి ఉంటారు. ఈసారి జరిగే సవరణ పూర్తిగా గత వాటిలా కాకపోవచ్చు, కానీ మార్క్ ట్వైన్ చెప్పినట్లుగా “చరిత్ర అదే విధంగా పునరావృతం కాకపోయినా దాని తీరులో మాత్రం సారూప్యత ఉంటుంది.” మార్కెట్‌లో ఉత్తమ రాబడులు పొందాలంటే, ఇతరులు భయపడుతున్నప్పుడు తెలివైన పెట్టుబడిదారుడు ధైర్యంగా వ్యవహరిస్తాడు.
అయితే మనం కూడా అలా చేయకుండా ఆపేది ఏమిటి? ఈ పతనాన్ని ఉపయోగించుకోవడంలో మనల్ని వెనక్కి లాగే కారణాలు మైయోపిక్ లాస్ అవర్షన్, రీసెన్సీ బయాస్ వంటి మనస్తత్వ పక్షపాతాలు. నోబెల్ బహుమతి గ్రహీత డానియెల్ కహ్నెమన్ ప్రతిపాదించిన ‘Two Selves’ (రెండు స్వరూపాలు) అనే సిద్ధాంతం ఆధారంగా ఎందుకు మనం “ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది” అని అనిపించుకుంటామో వివరించడానికి ఒక అభిప్రాయాన్ని అందిస్తున్నామన్నారు.
రెండు స్వరూపాలు (THE TWO SELVES)..
కహ్నెమన్ తన పుస్తకం Thinking, Fast and Slow లో ప్రతి వ్యక్తిలో రెండు స్వరూపాలు ఉంటాయని చెబుతారు:
• Remembering Self (గుర్తుంచుకునే స్వరూపం)
• Experiencing Self (అనుభవించే స్వరూపం)
అతను దీనిని ఒక ఉదాహరణతో వివరిస్తాడన్నారు. ఒక లెక్చర్ ముగిసిన తర్వాత అతని విద్యార్థుల్లో ఒకరు వచ్చి తాను విన్న సంగీత కచేరీ గురించి చెప్పాడు. “ఆ సంగీతం అద్భుతంగా ఉంది కానీ చివర్లో రికార్డింగ్‌లో ఒక భయంకరమైన కీచుమనిపించే శబ్దం వచ్చింది,” అని అన్నాడు. తరువాత భావోద్వేగంతో, “అది మొత్తం అనుభవాన్ని పాడు చేసింది” అని చెప్పాడు. కహ్నెమన్ ప్రకారం, ఆ విద్యార్థి అనుభవం నిజంగా పాడవలేదు; పాడైనది ఆ అనుభవానికి సంబంధించిన జ్ఞాపకం మాత్రమే. మంచి సంగీతాన్ని 20 నిమిషాలు ఆస్వాదించినప్పటికీ, చివర్లో వచ్చిన చెడు జ్ఞాపకం వల్ల ఆ మొత్తం అనుభవం విలువ లేకుండా పోయినట్లైంది. ‘అనుభవించే స్వరూపం’ (Experiencing Self) ప్రస్తుత క్షణంలో జీవిస్తుంది. డాక్టర్ “ఇప్పుడే నొప్పిగా ఉందా?” అని అడిగినప్పుడు స్పందించేది ఇదే.
‘గుర్తుంచుకునే స్వరూపం’ (Remembering Self) మన జీవితాన్ని కథలా నిర్మించి, అనుభవాలను గుర్తుంచుకుంటుంది. డాక్టర్ “ఇటీవల ఎలా అనిపిస్తోంది?” అని అడిగినప్పుడు సమాధానం చెప్పేది ఇదే. ‘అనుభవించే స్వరూపం’ ప్రతి క్షణాన్ని అనుభవిస్తుంటుంది, కానీ ఆ అనుభవాలన్నీ జ్ఞాపకాల్లో నిలవవు. ‘గుర్తుంచుకునే స్వరూపం’ మాత్రం మన అనుభవాల నుంచి మిగిలిన సంగతులను తీసుకుని కథగా నిలుపుతుంది.
ఈ రెండు స్వరూపాల భావన అనేక సందర్భాల్లో వర్తిస్తుంది. ఉదాహరణకు, శస్త్రచికిత్స చివర్లో నొప్పి తగ్గితే రోగులకు మంచి జ్ఞాపకం ఉంటుంది; కానీ చివర్లో ఎక్కువ నొప్పితో ముగిస్తే, మొత్తం అనుభవం చెడ్డదిగా గుర్తుంటుంది. పేరెంటింగ్‌ను తీసుకుంటే: తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచిన అనుభవాన్ని సాధారణంగా మంచి జ్ఞాపకంగా గుర్తుంచుకుంటారు. కానీ రోజువారీగా పిల్లలను పెంచే అనుభవం అంత సులభంగా లేదా ఆనందంగా ఉండకపోవచ్చు.
అలాగే సెలవులు (హాలిడేస్) గురించి ఆలోచించండి. మీరు అద్భుతమైన సెలవులను గడిపినా, చివర్లో మీ పాస్‌పోర్ట్, వాలెట్ పోయినట్లయితే, ‘గుర్తుంచుకునే స్వరూపం’ ఆ అనుభవాన్ని ఎక్కువగా బాధతో కూడిన కథగా మార్చేస్తుంది.
ఇది మార్కెట్లకు ఎలా సంబంధించింది?
ఇది నా అభిప్రాయం : గతంలో జరిగిన మార్కెట్ పతనాల సమయంలో చాలా మంది పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టిన అనుభవం కలిగి ఉంటారు. సంక్షోభాలు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులను పెంచుకోవడానికి ఒక అవకాశం అని, తరువాత మార్కెట్ పుంజుకున్నప్పుడు మంచి లాభాలు వస్తాయని వారు గుర్తుంచుకుంటారు. ప్రతి కొత్త పతనం ప్రారంభమైనప్పుడు, ఈ పెట్టుబడిదారులు ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ‘గుర్తుంచుకునే స్వరూపం’ వారికి చెడు సమయాల్లో పెట్టుబడి పెట్టడం ఎంత లాభదాయకమో చెప్పే కథను తిరిగి వినిపిస్తుంది. కానీ ‘గుర్తుంచుకునే స్వరూపం’ గతంలోని ప్రతి క్షణాన్ని పూర్తిగా నిలుపుకోదు.
గత పతనాల సమయంలో వ్యతిరేక దిశలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఎదురైన భయం, బాధ, ఆందోళన వంటి ప్రతి అనుభవాన్ని ‘అనుభవించే స్వరూపం’ ఎదుర్కొంది. అయితే ఆ క్షణాల్లో చాలా భాగం జ్ఞాపకాలలో నిలవదు; చివరికి మంచి ఫలితాలు మాత్రమే కథలో ప్రధానంగా నిలుస్తాయి. ప్రస్తుతం మార్కెట్ పడిపోతున్న సమయంలో, ‘అనుభవించే స్వరూపం’ ప్రతిరోజూ వ్యతిరేక ధోరణిలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే బాధను అనుభవిస్తుంది. కొన్ని రోజుల్లోనే, ‘గుర్తుంచుకునే స్వరూపం’ చెప్పిన కథకు భిన్నంగా పరిస్థితులు ఉన్నట్లుగా అనిపిస్తుంది.
“ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది!”
ప్రతి పెద్ద పతనంలో పెట్టుబడిదారులు అదే భయం, అదే బాధను అనుభవించినప్పటికీ, ఈసారి కథ వేరుగా అనిపిస్తుంది. గతంలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని భావించే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి కేవలం పతనాల్లోనే కాదు, బుల్ మార్కెట్‌లలో కూడా కనిపిస్తుంది. గత బబుల్స్‌లో నష్టపోయిన అనుభవం ఉన్నప్పటికీ, కొత్త బబుల్‌లో మళ్లీ పెట్టుబడులు పెడతారు అదే “ఈసారి భిన్నం” అనే నమ్మకంతో. ప్రతి కొన్ని సంవత్సరాలకు మార్కెట్ సవరణలు జరుగుతాయి.
భయం, ఆందోళన కారణంగా చాలా మంది పెట్టుబడిదారులు మార్కెట్ దిగువ స్థాయికి దగ్గరలోనే అమ్మేస్తారు. మార్కెట్ ఒక పెండులం లాగా తీవ్రమైన నిరాశ వైపు ఊగుతుంది. అయితే సరైన మనస్తత్వం ఉన్న పెట్టుబడిదారుడు ఈ చక్రాలను తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. నిజం ఏమిటంటే, ఖచ్చితమైన దిగువ లేదా పై స్థాయిని పట్టుకోవడం సాధ్యం కాదు. అందుకే, ఇలాంటి సమయాల్లో SIPలు లేదా STPల ద్వారా దశలవారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల తక్షణ అస్థిరత ప్రమాదాన్ని తగ్గించవచ్చు, మార్కెట్ చక్రాలన్నింటిలోనూ పాల్గొనే అవకాశం లభిస్తుంది.
