45yrs | మూడో తరం చేతికి పగ్గాలు!

45yrs | మూడో తరం చేతికి పగ్గాలు!

45yrs | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టీడీపీ ఆవిర్భ‌వించి ఇప్ప‌టికి 45 ఏళ్లవుతుంది. 1982లో నంద‌మూరి తార‌క రామారావు ఈ పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిర్భ‌వించిన‌ అతికొద్ది కాలంలోనే తెలుగు రాష్ర్టాల ప్ర‌జ‌లు ఆద‌రించారు. అంతేకుండా ఆ పార్టీకి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు అధికారం కూడా అందించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యి పేద ప్ర‌జ‌ల కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టాడు. అప్ప‌టివ‌ర‌కు పార్టీ అంటే కాంగ్రెస్ అని ఉండేది. కానీ దానికి ధీటుగా ఓ ప్రాంతీయ పార్టీగా టీడీపీ దూసుకొచ్చింది. ఈ పార్టీ ఆవిర్భావం అనంత‌రం తెలుగు ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ చైత‌న్యం వ‌చ్చింది.

అయితే ఎన్టీఆర్ త‌ర్వాత టీడీపీ ప‌గ్గాల‌ను 1995లో చంద్రబాబు నాయుడు చేప‌ట్టారు. సుమారు 30 ఏళ్లుగా ఆయ‌న అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన రికార్డు చంద్రబాబుకే ద‌క్కింది. పార్టీ అధ్య‌క్షుడిగా, రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు త‌న‌దైన ముద్ర వేశారు. పాల‌న‌లోనూ దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ.. ముందు చూపుతో లోకేశ్ కు కీలక బాధ్యతలు అప్ప‌గించారు. యువనేత నారా లోకేశ్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు.

యువనేత నారా లోకేశ్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడంతో టీడీపీలో మూడో తరం పాలన ఆరంభమైంద‌నే చ‌ర్చ కొన‌సాగుతోంది. ఆయ‌న నియామ‌కంతో టీడీపీలో నూతన ఉత్తేజం వచ్చింది. చంద్రబాబు అధినేతగా ఉన్నా..పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో ప్రస్తుతం ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే పార్టీ కార్య‌క‌లాపాలు జ‌ర‌గ‌నున్నాయి. ఆయ‌న నిర్ణయాలే ఇక‌పై అమలు అవుతాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప‌నిచేసిన లోకేశ్ పార్టీలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకువచ్చారు. కింది స్థాయి కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటూ మంచి నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు లోకేష్ చేపట్టిన ‘యువగళం పాదయాత్రస స‌క్సెస్ అయ్యింది. 3000 కిలోమీటర్లకు పైగా పాద‌యాత్ర చేసి ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం సాధించ‌డంలో కీల‌క‌మ‌య్యారు. ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావ‌డంతో ఇక‌పై పార్టీలో సీనియర్ నాయకుల అనుభవాన్ని గౌరవిస్తూనే, క్షేత్రస్థాయిలో యువ కార్యకర్తలను ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌లువురు సూచిస్తున్నారు. టీడీపీ భ‌విత‌వ్యం ఇక నారా లోకేష్ చేతుల్లోనే ఉంద‌ని, పార్టీ సిద్ధాంతాల‌ను కొన‌సాగిస్తూ మంచి పేరు తీసుకురావాల‌ని ప‌లువురు ఆశిస్తున్నారు.

Leave a Reply