పరమ పుణ్యప్రదం… సింహాచల గిరి ప్రదక్షిణం విశిష్టత ఇదే
పరమ పుణ్యప్రదం… సింహాచల గిరి ప్రదక్షిణం విశిష్టత ఇదే
- సింహాద్రి అప్పన్న క్షేత్ర మహిమ
- వరాహ లక్ష్మీనరసింహ స్వామి విశిష్టత
- కప్పస్తంభం వెనుక ఉన్న విశ్వాసం
- గిరి ప్రదక్షిణ విశేషాలు, పుణ్యఫలం
విశాఖ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంత భక్తులంతా సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి కొలువై వున్న ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం సింహాచలం. దీనిని షిమాద్రి ఆలయం అని కూడా పిలుస్తారు. సింహాచలం… సింహం కొండ అని అర్థం. ఇది పద్దెనిమిది నరసింహ క్షేత్రాలలో ఒకటి. చందన రూపుడు, సింహాచలేశుడు దేశంలోని అన్ని నారసింహ క్షేత్రాల్లో విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రం అతి ప్రాచీనమైనది. విశాఖపట్నానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో, సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున వున్న ‘సింహగిరి’ అనే పర్వతం మీద కొలువై వున్న సింహాచలం తెలుగు రాష్ట్రాల్లోనే సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం.
ఈ క్షేత్రంలో భక్తులందరూ ‘సింహాద్రి అప్పన్న’గా పిలుచుకునే వరాహ లక్ష్మీనరసింహ స్వామి కొలువై వున్నాడు. సింహాచలం క్షేత్రంలో రెండు విష్ణు అవతారాలు కలసిన మూర్తిని పూజిస్తారు. రెండు అవతారాలు ఒకదానికొకటి సంబంధించి ఉన్నాయని అర్థం. ఒకటి భూదేవి భర్తయైన వరాహావతారం. రెండవది లక్ష్మీదేవి భర్తయైన నరసింహావతారం. వేదాలు అపహరించిన హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహ అవతారం, ఆ తర్వాత యుగంలో హరి ద్వేషంతో భక్తులను హింసించిన హిరణ్యకశిపుని వధించిన నృసింహావతారాల కలయికగా వరాహ నృసింహ స్వామిగా స్వయంభువుగా ఇక్కడ వెలిశారని చెబుతారు.
హిరణ్యకశిపుని వధానంతరం భక్తశ్రేష్ఠుడు ప్రహ్లాదుడు ఈ స్వామిని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. చంద్రవంశానికి చెందిన పురూరవుడు గగనయానం చేస్తూ ఈ ప్రాంతం మీదుగా వెళ్తుండగా, ఈ క్షేత్రంలోని దివ్యశక్తి ప్రభావం వల్ల విమానం కిందకు దిగిందని కథనం. భూమిలో నిక్షిప్తమైన స్వామివారిని దర్శించిన పురూరవుడికి ఆకాశవాణి ద్వారా సంవత్సరం పొడవునా చందనంతో కప్పి ఉంచి, వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే నిజరూప దర్శనం కల్పించాలని ఆదేశం లభించిందని చెబుతారు.
మూల విరాట్టు లింగాకారంలో కనిపిస్తుంది. అసలు విగ్రహానికి చందనం లేపనం చేయడం వల్ల ఆ విధంగా కనిపిస్తుంది. విగ్రహం వేడిగా ఉంటుందని, ఆ వేడిని ఉపశమింపజేయడానికి నిరంతరం చందనం పూస్తారని భక్తుల విశ్వాసం. దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్పస్తంభం ఉంది. ఈ స్తంభంలో సంతాన గోపాల యంత్రం ప్రతిష్ఠించబడి ఉందని, ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తులు నమ్ముతారు. సంతానం లేనివారు ఈ కప్పస్తంభాన్ని కౌగిలించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. స్వామివారికి భక్తులు కప్పాలు (పన్ను) చెల్లించే ప్రదేశం కావడంతో దీనిని కప్పపు స్తంభం అని పిలిచేవారని, కాలక్రమేణా అది కప్పస్తంభంగా మారిందని చెబుతారు.
సింహాచల క్షేత్రానికి సంబంధించి గిరి ప్రదక్షిణ అత్యంత ముఖ్య కార్యక్రమం. ఆషాఢ శుద్ధ చతుర్దశి సందర్భంగా నిర్వహించే సింహాచలం గిరి ప్రదక్షిణలో విశాఖపట్నంలో జూలై 28 మధ్యాహ్నం 2 గంటలకు సింహాచలం కొండ దిగువన ఉన్న తొలి పావంచా నుంచి అప్పన్న స్వామి విగ్రహంతో పుష్పరథం ప్రారంభమవుతుంది.
సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి, కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి, కొండపైన స్వామిని దర్శించడం ఈ ఉత్సవంలోని ప్రధాన విశేషం. ఆషాఢ పౌర్ణమి రోజున గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా నిర్వహిస్తారు. కొండ దిగువన ఉన్న తొలి పావంచా నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులు మరుసటి రోజు ఆలయంలో అప్పన్న స్వామిని దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుందనే భక్తుల అచంచల విశ్వాసం.
