భూపాలపల్లిలో విషాదం..

భూపాలపల్లిలో విషాదం..

భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : విధి నిర్వహణలో నిమగ్నమైన ఓ ప్రభుత్వ అధికారి క్షణాల్లో మృత్యువాత పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీవో) వెంకన్న సోమవారం చెల్పూరు శివారులోని ఆర్టీవో కార్యాలయం ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రతి రోజులాగే వాహనాల తనిఖీల్లో నిమగ్నమైన వెంకన్న, రహదారి భద్రత కోసం విధులు నిర్వహిస్తుండగా అతివేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ మృత్యురూపంలో మారింది. టీఎస్ 22టీ 2687 నంబర్ గల బొగ్గు టిప్పర్ (లారీ) ఆర్టీవో వాహనం సమీపంలో ఉన్న వెంకన్నను ఢీ కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ మార్గమధ్యలోనే కన్నుమూశారు.

కొద్ది రోజుల క్రితమే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదిలీ పై వచ్చిన వెంకన్న, తన విధుల పట్ల అంకితభావంతో పని చేస్తున్నారని సహచరులు గుర్తు చేసుకుంటున్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్న సమయంలోనే ఆయన మృతి చెందడం అందరినీ కలచివేసింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాసేపటి క్రితం వరకు తమతో కలిసి విధులు నిర్వహించిన అధికారి ఇక లేరన్న విషయం జీర్ణించుకోలేక సహచరులు కన్నీటి పర్యంతమయ్యారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వెంకన్న మృతి జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆర్టీవో కార్యాలయం పరిసరాలు శోకసంద్రంగా మారగా ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించాయి. ప్రజా సేవకు అంకితమైన ఓ అధికారి జీవితం ఇంత విషాదకరంగా ముగియడం పట్ల జిల్లా వ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.