సింధు హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో… మెగా రక్తదాన కార్యక్రమం!

  • కేవలం ఒక్క రోజులోనే భారీ రక్తదాన శిబిరం నిర్వహణ
  • ప్రభుత్వ ఆసుపత్రుల కోసం 1,000 యూనిట్ల రక్త సేకరణ

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ‌ : హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ఉన్న సింధు హాస్పిటల్స్‌ కేవలం ఒకే ఒక రోజులో 1000 యూనిట్ల రక్తాన్ని సేకరించే లక్ష్యంగా ఓ మెగా రక్తదాన డ్రైవ్‌ను (కార్యక్రమాన్ని) విజయవంతంగా నిర్వహించింది. ప్రజల్లో… మరీ ముఖ్యంగా యువతలో రక్తదానం పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ‘స్వచ్ఛంద రక్తదాన ప్రాధాన్యా’న్ని వివరించేందుకు ఈ మెగా రక్తదాన కార్యక్రమం ఓ కీలక భూమిక పోషించనుంది.

ఈ రక్తదాన కార్యక్రమంలో సింధు హాస్పిటల్స్, హెటెరో గ్రూప్‌ సంస్థల ఉద్యోగులతో పాటు స్వచ్ఛంద సేవకులు, ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. నిత్యం సామాజిక సేవలనూ, ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రోత్సహించే సింధు హాస్పిటల్స్‌ చైర్మన్, హెటెరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ బి. పార్థసారథి రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన డ్రైవ్‌ కార్యక్రమాన్ని హెటెరో హెల్త్‌ కేర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎమ్‌. శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభించారు.

ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే వనరుల్లో రక్తం అత్యంత విలువైనది. ప్రాణాలు కాపాడటంలో ఇది అత్యంత కీలకం. థలసీమియా, సికిల్‌ సెల్‌ అనీమియా, లుకేమియా, రకరకాల క్యాన్సర్లతో బాధపడే పేషెంట్ల ప్రాణ రక్షణకు నిత్యం రక్తం ఎక్కించడం అవసరమవుతుంది. అలాగే రోడ్డు ప్రమాదాల్లోని క్షతగాత్రులకూ, అగ్నిప్రమాదాల్లో తీవ్రంగా కాలిన గాయాలతో బాధపడేవారికీ, మేజర్‌ శస్త్రచికిత్సలు చేయించుకునే పేషెంట్లతో పాటు అత్యవసర వైద్యసేవలు అవసరమైన బాధితులకు నిరంతరం రక్తం నిల్వలు అందుతూ ఉండటం చాలా అవసరం. వీళ్లందరి ప్రాణ రక్షణకు రక్తం చాలా కీలకం.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తం నిల్వల కొరతను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేకరించిన రక్తాన్ని ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, నిమ్స్‌, ఎంఎంజే ఇంస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ అండ్‌ రీజినల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ వంటి ప్రముఖ ఆసుపత్రులకు అందజేశారు. ఫలితంగా అత్యవసర రక్త మార్పిడీ (బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌), క్రిటికల్‌ కేర్‌ సేవలు అవసరమైన అనేక మంది బాధితులకు ప్రయోజనం చేకూరనుంది.

ఈ మెగా రక్తదాన కార్యక్రమం ద్వారా ప్రజల్లో స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో సింధు హాస్పిటల్స్‌ తన వంతు భూమికను పోషించింది. రక్తం అవసరమైన ప్రతి రోగి ప్రాణాలను కాపాడేందుకు అంకితభావంతో వ్యవహించడంలో తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. అలాగే తన సేవలను చాటేందుకూ, సమాజాన్ని చైతన్యపరిచేందుకు ఈ రక్తదానం కార్యక్రమం ఓ వేదికగా పనిచేస్తుంది. ఒకే ఒక రక్తదానం వల్ల ఎన్నెన్నో ప్రాణాలను కాపాడవచ్చేనే స్ఫూర్తినిస్తూ… తమ ఆరోగ్య సేవలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయనే సందేశాన్ని ఈ రక్తదాన కార్యక్రమం ద్వారా సింధు హాస్పిటల్స్‌ అందించింది.

సింధు హాస్పిటల్స్‌ గురించి…

హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలో ఉన్న సింధు హాస్పిటల్స్‌ దేశంలోని అతిపెద్ద సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో (మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో) ఒకటి. లాభాపేక్ష లేకుండా సేవే లక్ష్యంగా నడుపుతున్న హాస్పిటల్‌ ఇది. ఇక్కడ క్యాన్సర్‌ చికిత్సను లక్ష్యంగా చేసుకుని, అత్యంత అధునాతన వైద్యసేవలనూ, అనేక రకాల ఇతర చికిత్సలనూ అందిస్తున్నారు. సుమారు 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 18 అంతస్తులతో నిర్మితమైన ఈ ఆసుపత్రిలో 30కుపైగా వైద్య విభాగాల్లో సమగ్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.

అత్యాధునిక వ్యాధి నిర్ధారణ సదుపాయాలూ, ఉన్నతస్థాయి మౌలిక వసతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న ఈ హాస్పిటల్‌ ప్రజలందరికీ అందుబాటు ధరలోనే మానవీయ దృక్పథంతో తమ రోగులకు సహానుభూతితో కూడిన వైద్య సేవలను అందిస్తోంది. అత్యంత విశేషానుభవమున్న వైద్యనిపుణుల టీమ్‌ ఆధ్వర్యంలో పేషెంట్లకు మెరుగైన, అత్యంత నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయి.