తిరువూరు మెప్మా అధ్యక్షురాలిగా డెక్కా నవ్య విజయం.

తిరువూరు మెప్మా అధ్యక్షురాలిగా డెక్కా నవ్య విజయం.

ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముగిసిన టీఎల్ఎఫ్ ఎన్నికల ప్రక్రియ
23 మంది సభ్యుల మద్దతుతో నూతన కమిటీ ఎన్నిక
కూటమి నేతల శుభాకాంక్షలు.. పేదల సంక్షేమమే లక్ష్యమన్న ఎమ్మెల్యే కొలికపూడి

తిరువూరు, ఆంధ్ర‌ప్ర‌భ : తిరువూరు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలోని టౌన్ లెవల్ ఫెడరేషన్ (TLF) నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం అత్యంత ఉత్కంఠభరితంగా ముగిశాయి. సభ్యుల భారీ మద్దతుతో డెక్కా నవ్య తిరువూరు మెప్మా టీఎల్ఎఫ్ అధ్యక్షురాలిగా ఘన విజయం సాధించారు. పలు అడ్డంకులు, రాజకీయ సమీకరణాల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి వెల్లివిరిసింది.

నూతన కార్యవర్గ ఎంపిక ఇలా..

మొత్తం 23 మంది ఎస్ఎల్ఎఫ్ (SLF) ప్రతినిధుల సంపూర్ణ మద్దతుతో డెక్కా నవ్య అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు కార్యవర్గంలోని ఇతర కీలక పదవులకు ఈ క్రింది వారు ఎన్నికైనట్లు అధికారులు వెల్లడించారు: కార్యదర్శి: ఎం. ఎలీనా, కోశాధికారి: సావిత్రి, జాయింట్ సెక్రటరీ: బేబీ సరోజినీ, ఉపాధ్యక్షురాలు: కృష్ణవేణి, పేదరిక నిర్మూలనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే కొలికపూడి. ఎన్నికల్లో గెలిచిన నూతన కమిటీ సభ్యులను తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మెప్మా అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక. ఇది పేదల సంక్షేమం కోసం ఏర్పాటైన స్వతంత్ర సంస్థ. నూతన కార్యవర్గం రాజకీయాలకు అతీతంగా, పట్టణంలోని పేద మహిళల ఆర్థిక సాధికారత కోసం నిరంతరం కృషి చేయాలి” అని సూచించారు.

మహిళా సాధికారతకు నిదర్శనం : పెనుగొండ రామచంద్రరావు..

బిజెపి నియోజకవర్గ కన్వీనర్ పెనుగొండ రామచంద్రరావు మాట్లాడుతూ.. డెక్కా నవ్య ఎన్నిక ప్రజాస్వామ్య విజయం అని కొనియాడారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశించిన మహిళా సాధికారత దిశగా ఈ కమిటీ అడుగులు వేయాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు పోలే శాంతి, జనసేన నాయకులు ఉయ్యూరు జయప్రకాష్ తదితరులు నూతన కమిటీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

వ్యూహకర్తకు కృతజ్ఞతలు తెలిపిన డెక్కా నవ్య..

తన గెలుపుకు సహకరించిన కూటమి నాయకులకు డెక్కా నవ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా జనసేన నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు మనుబోలు శ్రీనివాసరావు తనకు అన్నలా అండగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల వ్యూహరచనలో, అన్ని పార్టీల మద్దతు కూడగట్టడంలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిదని, తన గెలుపులో ఆయన కీలక భాగస్వామి అని డెక్కా నవ్య భావోద్వేగానికి లోనయ్యారు.

మనుబోలు శ్రీనివాసరావు ఫోన్ ద్వారా నూతన అధ్యక్షురాలికి అభినందనలు అందజేశారు. సంబరాల్లో కార్యకర్తలు కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన డెక్కా నవ్య విజయం సాధించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పట్టణంలో హర్షం వ్యక్తం చేశారు. పేదల కోసం పనిచేసే సంస్థలో సరైన నాయకత్వం ఎన్నికైందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply