ప్రజాస్వామ్య విజయం..

ప్రజాస్వామ్య విజయం..
సభ్యుల నిర్బంధాన్ని ఎదిరించి ఎన్నిక పూర్తి.
కూటమి ధర్మం పాటిస్తూ జనసేనకు పట్టం కట్టిన ఎమ్మెల్యే కొలికపూడి.
తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు మున్సిపల్ కార్యాలయం వేదికగా శనివారం జరిగిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కార్యవర్గ ఎన్నికలు హైడ్రామా నడుమ ముగిశాయి. రాజకీయంగా పెను దుమారం రేపిన ఈ ఎన్నికల్లో పలు ఆటంకాలు ఎదురైనప్పటికీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ విజయవంతమైంది. మీడియా, పోలీసుల సమక్షంలో మెప్మా సభ్యులు తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు.

నిర్బంధాలు.. బెదిరింపులు..
మెప్మా ఎన్నికల షెడ్యూల్ 15 రోజుల క్రితమే ఖరారైనప్పటికీ, నేడు ఎన్నికల సమయానికి ఎంపీ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు గొడవలకు దిగారు. మొత్తం 33 మంది మెప్మా సభ్యులలో 7 గురు సభ్యులను బలవంతంగా నిర్బంధించి, ఎన్నికలను అడ్డుకోవాలని చూడటం కలకలం రేపింది. సభ్యుల ఇళ్ల వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కూటమి ఐక్యతకు నిదర్శనం..
గత కొంతకాలంగా మెప్మా కార్యవర్గంలో తమకు ప్రాతినిధ్యం కావాలని జనసేన నాయకులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలతో చర్చించి, మెప్మా కార్యవర్గాన్ని జనసేనకు కేటాయించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి కట్టుబడి నేడు జనసేన అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేశారు.
రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. చెక్ పెట్టిన కొలికపూడి..
పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోందని తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వెంటనే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, మీడియా సమక్షంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా స్వయంగా పర్యవేక్షించారు. “అర్హత లేని వ్యక్తులను, పేకాట క్లబ్బులు నడిపేవారిని మెప్మాలోకి తీసుకురావాలని చూడటం దురదృష్టకరం” అని ఎమ్మెల్యే ఈ సందర్భంగా మండిపడ్డారు.
అధికారుల తీరుపై నిప్పులు..
ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగా ముగిసిన తర్వాత, పైస్థాయి నుండి వచ్చిన రాజకీయ ఒత్తిళ్లతో ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల తీరు చట్టవిరుద్ధమని, వెంటనే గెలిచిన అభ్యర్థులను ధ్రువీకరించి బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య విజయం!
ఎన్ని బెదిరింపులు ఎదురైనా 26 మంది సభ్యులు ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని ఎమ్మెల్యే కొలికపూడి కొనియాడారు. మెప్మా అనేది పేదల అభివృద్ధి కోసం పనిచేసే సంస్థ అని, దీనిని రాజకీయ క్రీడలకు వాడుకోవడం తగదని ఆయన హితవు పలికారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులకు, అధికారులకు సూచించారు.
