తోతాపురి రైతులకు గిట్టుబాటు ధర కోసం చర్యలు

తోతాపురి రైతులకు గిట్టుబాటు ధర కోసం చర్యలు

10 రోజుల్లో ధరలు మెరుగుపడే అవకాశం: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: జిల్లాలో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ధరల సమస్యపై జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపడుతోందని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వేలాది మంది రైతులు తోతాపురి మామిడి సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.

గత నెల రోజులుగా ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, శీతల పానీయాల తయారీ సంస్థల ప్రతినిధులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం దిండిగల్, కృష్ణగిరి, శ్రీనివాసపురం, చిత్తూరు మార్కెట్లలో తోతాపురి మామిడి ధర కిలోకు రూ.5 నుంచి రూ.6 మధ్య కొనసాగుతోందని చెప్పారు. మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం వల్లే ధరలు పడిపోయాయని వివరించారు.

కోకాకోలా, పెప్సీ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపగా, వచ్చే జనవరి, ఫిబ్రవరి వరకు అవసరమైన మామిడి గుజ్జు నిల్వలు ఇప్పటికే తమ వద్ద ఉన్నాయని, ప్రస్తుతం కొనుగోళ్లపై డిమాండ్ తక్కువగా ఉందని వారు తెలిపినట్లు వెల్లడించారు.

సౌదీ అరేబియా, ఒమాన్ వంటి దేశాలకు మామిడి ఎగుమతులు తగ్గడం కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపిందన్నారు. మరోవైపు సాగు వ్యయాలు పెరగడం, ధరలు తగ్గిపోవడం వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

చిత్తూరు, కృష్ణగిరి జిల్లాల ప్రాసెసర్లతో ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు కలెక్టర్ తెలిపారు. మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, లాభదాయకత ఆధారంగానే ధరలు నిర్ణయిస్తున్నట్లు వారు వెల్లడించారని చెప్పారు.

జిల్లాలో అధికశాతం ప్రాసెసర్లు రైతులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ, కొంతమంది తక్కువ ధరలు ప్రకటించడం వల్ల మొత్తం మార్కెట్‌పై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ, మంత్రులు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులతో కలిసి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అవసరమైన చర్యలపై ఆలోచిస్తోందన్నారు.

మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు జిల్లా అధికారుల బృందాలు కృష్ణగిరి, శ్రీనివాసపురం తదితర ప్రాంతాలను సందర్శించి రైతులు, వ్యాపారులు, ప్రాసెసర్లతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు.

ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, రాబోయే 10 రోజుల్లో మార్కెట్‌లో నిల్వలు తగ్గి వినియోగం పెరగడం వల్ల తోతాపురి మామిడి ధరలు కొంత మేర మెరుగుపడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తోతాపురి రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని, ప్రభుత్వం తీసుకునే కొత్త నిర్ణయాలు, సహాయక చర్యల గురించి వెంటనే రైతులకు తెలియజేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు.