హనుమంత వాహనంపై గోవిందరాజస్వామి దివ్య విహారం..

హనుమంత వాహనంపై గోవిందరాజస్వామి దివ్య విహారం..
తిరుపతి సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై దివ్యమంగళ స్వరూపంతో భక్తులకు దర్శనమిచ్చి అభయప్రదానం చేశారు.
భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. నాలుగు మాడ వీధుల్లో అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకుని పరవశించారు. ఆలయ పరిసరాలు భక్తిరసంతో మారుమోగాయి.
త్రేతాయుగంలో శ్రీరాముడికి పరమభక్తుడిగా నిలిచిన హనుమంతుడు భక్తి, శక్తి, శరణాగతికి ప్రతీకగా నిలిచాడని పురాణాలు వివరిస్తున్నాయి. బుద్ధి, బలం, ధైర్యం, ఆరోగ్యం, నిర్భయత్వం, వాక్పటిమ హనుమత్స్మరణతో సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
ఈ నేపథ్యంలో స్వామివారు హనుమంత వాహనంపై విహరిస్తూ భక్తులకు శరణాగతి మహిమను చాటిచెప్పారు.
అనంతరం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకాలు చేసి విశేష పూజలు నిర్వహించారు.
మధ్యాహ్నం 3 గంటలకు వసంతోత్సవం ఘనంగా నిర్వహించనుండగా, అనంతరం స్వామివారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, విజివో గిరిధర్, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎవ్వో శ్రీనివాసరావు, అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.
