ఎండల నుంచి ఉపశమనం..

ఎండల నుంచి ఉపశమనం..

కనకదుర్గమ్మ భక్తులకు ఉచిత లస్సీ పంపిణీ..
దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం..
మహాగోపురం ఏడో అంతస్తులో ప్రత్యేక కౌంటర్ ద్వారా..
భక్తుల హర్షం.. అభినందనలు వెల్లువ

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించే ఉద్దేశంతో దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం ఉచితంగా లస్సీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనాన్ని పూర్తిచేసుకుని మహాగోపురం ఏడవ అంతస్తుకు చేరుకున్న భక్తులకు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకర్ బాబు ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు లస్సీ ప్యాకెట్లను అందజేశారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్రస్ట్ బోర్డు సభ్యులు స్వయంగా లస్సీ ప్యాకెట్ల పంపిణీలో పాల్గొని భక్తులకు అందజేశారు. దర్శనానంతరం అలసటతో బయటకు వచ్చే భక్తులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా మారింది. ఎండల తీవ్రత మధ్య చల్లని లస్సీ పంపిణీ చేయడం అభినందనీయమని భక్తులు పేర్కొన్నారు. దేవస్థానం చేపట్టిన ఈ సేవా కార్యక్రమంపై వారు హర్షం వ్యక్తం చేస్తూ ట్రస్ట్ బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply