Hyderabad Traffic Police | ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్… అటుగా వెల్తే జాగ్ర‌త్త !!

Hyderabad Traffic Police | ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్… అటుగా వెల్తే జాగ్ర‌త్త !!

  • హైదరాబాద్‌లో భారీ వర్షం..
  • పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: నగరాన్ని శుక్రవారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. పలుచోట్ల రహదారులపై భారీగా వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైర‌తాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, షేక్‌పేట్, మెహదీపట్నం ప్రాంతాలలో వాహనాల రాకపోకలు మందగించాయి. దీంతో ఈవినింగ్ టైంలో ఆఫీస్ డ్యూటీలు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు.

అలాగే ఆరాంఘర్, వాడి-ఎ-మహ్మద్, చింతల్‌మెట్ ప్రాంతాల్లోనూ నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు ప్రభావితమయ్యాయి. మరోవైపు అత్తాపూర్ వ‌ద్ద‌ కూడా ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుంది. పలు ప్రాంతాల్లో వాహనాలు భారీ క్యూల్లో నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వర్షం కారణంగా రోడ్లు స్కిడ్ అయ్యే చాన్స్ ఉన్నందున ఆకస్మికంగా బ్రేకులు వేయవద్దని, ఇతర వాహనాల నుంచి సురక్షిత దూరం పాటించాలని హెచ్చరించారు. ట్రాఫిక్ సిబ్బంది సూచనలను అనుసరిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా గచ్చిబౌలి, కూకట్‌పల్లి, కొండాపూర్, మాదాపూర్, మణికొండ, షేక్‌పేట్, టోలిచౌకి, నానక్‌రామ్‌గూడ, గోల్కొండ, మియాపూర్, రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ, మధ్య హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగగా, ఉత్తర హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. వర్షాల ప్రభావం మరికొంతసేపు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

Leave a Reply