తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు..
తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు..
కోకాపేట, రాయదుర్గం ప్రాంతాల్లో భారీ పెంపు
ప్లాట్ల మార్కెట్ విలువల్లో కోకాపేట టాప్
కొన్ని ప్రాంతాల్లో పాత మార్కెట్ విలువలే కొనసాగింపు
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా సవరించిన భూముల మార్కెట్ విలువలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల వాతలు మొదలయ్యాయి. వ్యవసాయ భూముల విలువలను ఏకంగా 50 నుంచి 100 శాతం వరకు పెంచేయడంతో రియల్ ఎస్టేట్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది.
ఓఆర్ఆర్ పరిధితో పాటు కోకాపేట, రాయదుర్గం వంటి ఏరియాల్లో రేట్లు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల కొనుగోలు, అమ్మకాలపై ప్రభావం చూపే కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన కొత్త మార్కెట్ విలువలు అమలులోకి రావడంతో రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే అన్ని రిజిస్ట్రేషన్లు కొత్త విలువల ఆధారంగానే పూర్తవుతున్నాయి.
రాష్ట్రంలో ఎకరాకు కనిష్ఠ మార్కెట్ విలువ గతంలో రూ.1.75 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.2.75 లక్షలకు పెరిగింది. గరిష్ఠ మార్కెట్ విలువ హైదరాబాద్ బేగంపేట ప్రాంతంలో ఎకరాకు రూ.35.29 కోట్లుగా ఉంది. ఓఆర్ఆర్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో భారీ పెంపు ప్రజలకు భారంగా మారింది.
కోకాపేట, రాయదుర్గం ఏరియాల్లో భారీ పెంపు
భూముల విలువల పెంపులో కోకాపేట, కొంగరకలాన్, రాయదుర్గం, హఫీజ్‌పేట్, నాగోల్ వంటి ప్రాంతాలు ముందున్నాయి. కోకాపేటలో ఎకరా విలువ రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షలకు పెరిగింది. కొంగరకలాన్‌లో రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు, బుద్వేల్‌లో రూ.5.5 కోట్ల నుంచి రూ.8.25 కోట్లకు చేరింది.
హఫీజ్‌పేట్‌లో రూ.11 కోట్ల నుంచి రూ.18 కోట్లకు, రాయదుర్గంలో రూ.9 కోట్ల నుంచి రూ.15 కోట్లకు, నాగోల్‌లో రూ.11 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంపు నమోదైంది. జిల్లాల్లో కూడా భూముల మార్కెట్ విలువల్లో మార్పులు చేశారు. నల్గొండలో ఎకరా విలువ రూ.2.25 లక్షల నుంచి రూ.3.93 లక్షలకు పెరిగింది. మిర్యాలగూడలో రూ.4.5 లక్షల నుంచి రూ.6.75 లక్షలకు, కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.25 లక్షల నుంచి రూ.6.03 లక్షలకు చేరింది. నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో రూ.78.40 లక్షల నుంచి రూ.90.16 లక్షలకు పెంపు నమోదైంది.
ప్లాట్ల విలువలు
ప్లాట్ల మార్కెట్ విలువల్లో అత్యధిక పెంపు కోకాపేటలో కనిపించింది. అక్కడ చదరపు గజం విలువ రూ.23,800 నుంచి రూ.47,600కు పెరిగింది. అత్తాపూర్‌లో రూ.20,300 నుంచి రూ.30,500కు, కొంపల్లిలో రూ.11,600 నుంచి రూ.17,400కు చేరింది.
హనుమకొండలో గజం విలువ రూ.5,800 నుంచి రూ.8,700కు, కాజీపేటలో రూ.9,500 నుంచి రూ.14,250కు పెరిగింది. అపార్ట్‌మెంట్ల మార్కెట్ విలువల్లో మాత్రం పరిమిత పెంపు మాత్రమే జరిగింది. అజంపురా, మాసబ్‌ట్యాంక్ ప్రాంతాల్లో చదరపు అడుగు విలువ రూ.2,500 నుంచి రూ.2,700కు పెరిగింది. ఆమనగల్లులో రూ.1,300 నుంచి రూ.1,600కు, మంకాల్, మోకిల, కొంపల్లి ప్రాంతాల్లో రూ.2,200 నుంచి రూ.2,700కు చేరింది. బాలానగర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో చదరపు అడుగు విలువ రూ.3,000గా నిర్ణయించారు.
పెరగని ప్రాంతాలు ఇవే..
కరీంనగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో పాత మార్కెట్ విలువలనే కొనసాగించారు. మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య పెద్దగా వ్యత్యాసం లేని ప్రాంతాల్లో మార్పులు చేయలేదు. అయితే అభివృద్ధి వేగంగా జరుగుతున్న ప్రాంతాలు, ఓఆర్ఆర్ పరిధి, ప్రధాన రహదారులు, వాణిజ్య కేంద్రాల సమీప ప్రాంతాల్లో గణనీయమైన పెంపులు చేపట్టారు.
మార్కెట్ విలువలు పెరిగినప్పటికీ రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న 7.5 శాతం రిజిస్ట్రేషన్ రుసుమే కొనసాగనుంది. అయితే కొత్త మార్కెట్ విలువల కారణంగా కొనుగోలుదారులు చెల్లించాల్సిన మొత్తం రిజిస్ట్రేషన్ వ్యయం పెరగనుంది.
ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నవారికి కూడా కొత్త విలువలే వర్తిస్తాయి. అదనంగా చెల్లించాల్సిన మొత్తాన్ని భూ భారతి పోర్టల్ ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు. ప్రజల సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సాప్ నంబర్ 82476 19983లను అందుబాటులో ఉంచారు.
కొత్త మార్కెట్ విలువల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం పెరగనుండగా, మరోవైపు భూములు, ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసే వారికి అదనపు భారం తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భూముల విలువ పెంపు ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏడాది కనీసం రూ.1200 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సవరించిన ప్లాట్ విలువలు
కోకాపేట ఏరియాలో పాత విలువ రూ.23,800 కాగా, కొత్త విలువ రూ.47,600గా నిర్ణయించారు. అత్తాపూర్ ఏరియాలో పాత విలువ రూ.20,300 కాగా, కొత్త విలువ రూ.30,500గా మారింది. కొంపల్లి ఏరియాలో పాత విలువ రూ.11,600 కాగా, కొత్త విలువ రూ.17,400గా ఉంది. కొండాపూర్, మాదాపూర్ ఏరియాల్లో కొత్త విలువ రూ.78,600గా నిర్ణయించారు. గచ్చిబౌలి, మియాపూర్ ఏరియాల్లో కూడా కొత్త విలువ రూ.78,600గా ఉంది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్ ఏరియాల్లో కొత్త విలువ రూ.67,400గా నిర్ణయించారు. మూసాపేట్, భరత్‌నగర్ ఏరియాల్లో కూడా కొత్త విలువ రూ.67,400గా ఉంది.
హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ల విలువలు
కొంపల్లి ఏరియాలో పాత విలువ రూ.2,200 కాగా, కొత్త విలువ రూ.2,700గా ఉంది. బాలానగర్ ఏరియాలో పాత విలువ రూ.2,500 కాగా, కొత్త విలువ రూ.3,000గా నిర్ణయించారు. పటాన్‌చెరు ఏరియాలో పాత విలువ రూ.2,500 కాగా, కొత్త విలువ రూ.3,000గా ఉంది. మాసబ్‌ట్యాంక్, అజంపురా ఏరియాల్లో పాత విలువ రూ.2,500 కాగా, కొత్త విలువ రూ.2,700గా మారింది. మోకిల ఏరియాలో పాత విలువ రూ.2,200 కాగా, కొత్త విలువ రూ.2,700గా నిర్ణయించారు.
హైదరాబాద్‌లో ఎకరా భూమి విలువ
హఫీజ్‌పేట్ ఏరియాలో పాత విలువ రూ.11 కోట్లు కాగా, కొత్త విలువ రూ.18 కోట్లకు పెరిగింది. నాగోల్ ఏరియాలో పాత విలువ రూ.11 కోట్లు కాగా, కొత్త విలువ రూ.20 కోట్లుగా మారింది. రాయదుర్గం ఏరియాలో పాత విలువ రూ.9 కోట్లు కాగా, కొత్త విలువ రూ.15 కోట్లకు పెరిగింది. బుద్వేల్ ఏరియాలో పాత విలువ రూ.5.5 కోట్లు కాగా, కొత్త విలువ రూ.8.25 కోట్లుగా నిర్ణయించారు. కోకాపేట ఏరియాలో పాత విలువ రూ.30 లక్షలు కాగా, కొత్త విలువ రూ.60 లక్షలకు చేరింది. కొంగరకలాన్ ఏరియాలో పాత విలువ రూ.15 లక్షలు కాగా, కొత్త విలువ రూ.30 లక్షలకు పెరిగింది.
జిల్లాల్లో ఎకరా భూమి విలువ
రంగారెడ్డి జిల్లాలో పాత విలువ రూ.1.01 కోట్లు కాగా, కొత్త విలువ రూ.1.16 కోట్లకు పెరిగింది. నల్గొండ జిల్లాలో పాత విలువ రూ.2.25 లక్షలు కాగా, కొత్త విలువ రూ.3.93 లక్షలకు చేరింది. మిర్యాలగూడలో పాత విలువ రూ.4.5 లక్షలు కాగా, కొత్త విలువ రూ.6.75 లక్షలుగా ఉంది. కరీంనగర్ జిల్లాలో పాత విలువ రూ.5.25 లక్షలు కాగా, కొత్త విలువ రూ.6.03 లక్షలకు పెరిగింది.
