అయ్యో పాపం.. తల్లి కళ్లముందే విషాదం…
అయ్యో పాపం.. తల్లి కళ్లముందే విషాదం…
బంగారుపాళ్యం, ఆంధ్రప్రభ: పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల పరిధిలోని బీఎల్ కండిగ ఎస్టీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది.
పోలీసుల సమాచారం మేరకు.. బీఎల్ కండిగ ఎస్టీ కాలనీకి చెందిన లోకేష్ కుమార్తె సత్య (14), ఆమెకు వరుసకు తమ్ముడు అయ్యే పవన్‌కుమార్ కుమారుడు రోహిత్ (9) బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సత్య తల్లి జ్యోతితో కలిసి గ్రామ సమీపంలోని పాలెం తోపు చెరువు వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్లారు.
ఆ సమయంలో ప్రమాదవశాత్తు సత్య, రోహిత్ నీటిలో పడి బురదలో ఇరుక్కుపోయారు. వారికి ఈత రాకపోవడం, సత్య తల్లి జ్యోతికి కూడా ఈత రాకపోవడంతో ఆమె సహాయం కోసం గట్టిగా కేకలు వేసినా, సమయానికి చుట్టుపక్కల ఎవరూ చేరుకోలేకపోయారు. దీంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.
విషయం తెలిసిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. అనంతరం వారిని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఇలా మృతి చెందడంతో బీఎల్ కండిగ ఎస్టీ కాలనీలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.
