పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో ముగ్గురి అరెస్ట్

పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో ముగ్గురి అరెస్ట్

  • రూ. 51 వేల నగదు స్వాధీనం

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పి ఎం జె జ్యువెలర్స్ దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 3న కరీంనగర్లోని పీఎంజే జ్యువెలర్స్ లో ఐదుగురు నిందితులు తుపాకులతో సిబ్బందిపై కాల్పులు జరిపి నగలు దోచుకొని వెళ్లిన విషయం విధితమే. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు గత వారం రోజులుగా మూడు రాష్ట్రాలకు పోలీసు బృందాలను పంపించి పెద్ద ఎత్తున విచారణ చేపట్టారు.

ఇందులో భాగంగా చోరీకి పాల్పడిన రఘునాథ్ కర్మాకర్, రవిష్ కుమార్, మెహతాబ్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘునాథ్ కర్మాకర్ ఈ ముఠాలో ప్రధాన నిందితుడు. నింధితుల నుండి రూ. 51,000 , 2 మొబైల్ ఫోన్స్, 2 సిమ్ కార్డ్స్, నకిలీ ఆధార్ కార్డు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దోపిడీలో 13 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించగా ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో 10 మంది పరారులో ఉన్నారు. చోరీ జరిగిన తీరు నిందితుల అరెస్టు వివరాలను కరీంనగర్ సిపి గౌస్ అలాం మీడియాకు తెలియజేశారు