Thorrur హరిపిరాల నర్సరీలో అవకతవకలపై నిరసన

Thorrur హరిపిరాల నర్సరీలో అవకతవకలపై నిరసన

  • రైతులకు నాణ్యమైన మొక్కలు అందించాలని బీఆర్ఎస్ డిమాండ్

తొర్రూరు (Thorrur), ఆంధ్రప్రభ: మండలంలోని హరిపిరాల-గోపాలగిరి శివారులో ఉన్న ఆయిల్ ఫామ్ నర్సరీలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హరిపిరాల-గోపాలగిరి శివారులోని ఆయిల్ ఫామ్ నర్సరీ ఎదుట బీఆర్ఎస్ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, నర్సరీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు వాటికి మద్దతు పలకడం సిగ్గుచేటన్నారు. అవకతవకలు లేకుంటే నర్సరీ గేటుకు తాళం ఎందుకు వేశారని ప్రశ్నించారు.

రైతులకు నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలు అందించాలని, కూలీలకు ప్రభుత్వం నిర్ణయించిన పూర్తి వేతనాలు ఎందుకు చెల్లించడం లేదని నిలదీశారు. హరిపిరాల నర్సరీలో నాసిరకం విత్తనాలు, వర్మి కంపోస్ట్, మట్టి, ఎరువులు వినియోగించడం వల్ల వేలాది మొక్కలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.

రైతులకు సరైన సమయంలో మొక్కలు అందకపోవడంతో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సరీలో 24 మంది కూలీలు పనిచేయాల్సి ఉండగా, కేవలం 11 మందితోనే పనులు చేయించడంతో మొక్కల సంరక్షణ సక్రమంగా జరగడం లేదన్నారు. మొక్కల పెంపకం, నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.

నర్సరీల్లో పనిచేస్తున్న కూలీలకు ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలు చెల్లించాలని, వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హరిపిరాల, గోపాలగిరి ఆయిల్ ఫామ్ నర్సరీల్లో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply