100yardrange | పొగాకు, గుట్కా, ఖైనీకి దూరంగా ఉండాలి ..

100yard range | పొగాకు, గుట్కా, ఖైనీకి దూరంగా ఉండాలి ..
ఆరోగ్యకర సమాజాన్న నిర్మాణం లో భాగస్వాములు కండి
పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ.
100yard range | విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజలను చైతన్యవంతులను చేసి జిల్లాను పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టరేట్ వద్ద వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్న అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పొగాకు వినియోగం వల్ల శరీరంలోని ప్రధాన అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపారు. నికోటిన్ కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్, పక్షవాతం, అంధత్వం, రక్తనాళాలు గట్టిపడటం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే ధూమపానం, పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడిన వారు వాటిని వెంటనే మానుకోవాలని సూచించారు.

ధనం, ప్రాణం, మానానికి నష్టం కలిగించే పొగాకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ‘స్వర్ణాంధ్ర–2047’ లక్ష్య సాధనలో ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు. జిల్లాలో విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించే నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. యువత పొగాకు వ్యామోహంలో పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

స్వచ్ఛంద సంస్థల సహకారంతో కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో పొగాకు దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పొగాకు అలవాటు మానుకోవాలనుకునే వారికి జిల్లా ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు చెప్పారు. కోట్పా చట్టాన్ని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఏపీ ఈగల్ ఐజీ కె. రవికృష్ణ మాట్లాడుతూ, యువతను లక్ష్యంగా చేసుకుని పొగాకు పరిశ్రమలు అమలు చేస్తున్న ప్రచార వ్యూహాలను గుర్తించి వాటిని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ కార్యక్రమం ద్వారా విద్యాసంస్థల పరిసరాల్లో అక్రమ పొగాకు విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోట్పా చట్టంలోని సెక్షన్ 6(బి) ప్రకారం విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిరోధిస్తున్నామని చెప్పారు.
పొగాకు వ్యసనం ఇతర మాదకద్రవ్యాల వ్యసనాలకు కూడా దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. చిన్న వయసులోనే నికోటిన్ ఉత్పత్తులకు అలవాటు పడిన యువత భవిష్యత్తులో మద్యం, మాదకద్రవ్యాలు వంటి ఇతర వ్యసనాల వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, చట్ట అమలు సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్‌టీసీపీ కన్సల్టెంట్ డా. వి. సౌజన్య లక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ డా. జి. సమరం, రాష్ట్ర వీఎచ్‌ఏ ప్రధాన కార్యదర్శి షేక్ ఇస్మాయిల్, రాష్ట్ర కోఆర్డినేటర్ మన్మోహన్, ఈగల్ ఎస్పీలు నాగేశ్ బాబు, ప్రభాకర్, స్వరూపరాణి, ఎన్టీఆర్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. మాధవి, జిల్లా యువజన సంక్షేమ అధికారి డా. కొల్లేటి రమేష్, జిల్లా డీఎస్‌డీఓ కోటేశ్వరరావు, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ రమేష్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రెడ్‌క్రాస్ వాలంటీర్లు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.
