AP | పులి హంతకుల అరెస్ట్…
నిందితులకు 14 రోజుల రిమాండ్
4 రోజుల వ్యవధిలోనే పులి హంతకుల అరెస్టు
డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారి ఆధ్వర్యంలో ఛేదించిన పులి హత్య కేసు
పులి గోర్ల కోసం కొనసాగుతున్న విచారణ
వన్యప్రాణి సంరక్షణ చట్టం కఠినంగా అమలుకు ఆదేశం
పులి మృతి సంఘటన స్థలాన్ని పరిశీలించిన హై లెవెల్ కమిటీ
AP | గిద్దలూరు, ఆగస్టు 6 (ఆంధ్రప్రభ) : నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ టి ఎస్ ఆర్) పరిధిలోని గిద్దలూరు అటవీ డివిజన్ రాచర్ల బీట్ అటవీ ప్రాంతంలో గత నెల 31వ తేదీ పెద్దపులి కళేబరాన్ని గుర్తించిన కేసుకు సంబంధించి నాలుగు రోజుల వ్యవధిలోనే 7మంది హంతకులను అటవీశాఖ అధికారులు కటకటాల వెనక్కి నెట్టారు. నిందితులను ఈనెల 4వ తేదీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. రాచర్ల బీట్ జేపీ చెరువు సమీపంలోని అంబచెరువు తొట్టె మడుగు అటవీ ప్రాంతంలో పెద్దపులి కళేబరాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు గిద్దలూరు ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారికి సమాచారమిచ్చారు.
వెంటనే ఆమె ఉన్నతాధికారులకు సమాచారం అందజేసి నంద్యాల ఫీల్డ్ డైరెక్టర్ పర్యవేక్షణలో సంఘటనా స్థలానికి చేరుకొని సమాచారం సేకరించి కేసు నమోదు చేశారు. పెద్దపులి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. పులి మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. వేటగాళ్లు పులిని నాటు తుపాకితో కాల్చినట్టు గుర్తించి డాగ్స్ స్క్వాడ్ ను రప్పించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితుల ఆచూకీ కనుగొని అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఏడు మంది నిందితులను అరెస్టు చేయడంతో పాటుగా వారి నుండి 7 పులి గోర్లు, ఒక గొడ్డలి, ఒక నాటు తుపాకీ, పులి అవయవ భాగాలను స్వాధీనం చేసుకున్నారు.

మిగిలిన పులి గోర్ల కోసం కొనసాగుతున్న విచారణ..
పెద్దపులి హంతకులను నాలుగు రోజుల వ్యవధిలోనే గుర్తించిన అటవీ శాఖ అధికారులు మిగిలిన పులి గోర్ల ఆచూకీ కోసం విచారణ కొనసాగిస్తున్నారు. అరెస్టు కాబడిన నిందితుల సమాచారం మేరకు మరి కొంతమంది అనుమానితులను విచారిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే మిగిలిన పులి గోర్లను స్వాధీనం చేసుకుంటామని గిద్దలూరు ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారి తెలిపారు.
అందరి సహకారంతోనే పులి హత్య కేసు ఛేదన..
వేటగాళ్లు నాటు తుపాకీతో పులిని కాల్చి చంపిన కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేయడం జరిగిందని ఇందులో భాగంగా వివిధ రకాల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. అటవీ శాఖ అధికారులతో పాటుగా సాంకేతిక పరిజ్ఞాన సహకారం అందించిన పోలీస్ శాఖ అధికారులు, హనుమాన్ బృందం విచారణలో కీలకపాత్ర పోషించాయని డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారి తెలిపారు.
పులి మృతి సంఘటన ప్రాంతాన్ని సందర్శించిన హై లెవెల్ కమిటీ..
పెద్దపులి మృతి చెందిన సంఘటన ప్రాంతాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు మంది సభ్యులతో కూడిన హైలెవెల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ బుధవారం పులి మృతి చెందిన ప్రాంతాన్ని గిద్దలూరు ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్ నిషాకుమారితో కలిసి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. వణ్య ప్రాణుల సంరక్షణకు తీసుకోవలసిన చర్యలు, వన్యప్రాణి సంరక్షణ చట్టం కఠినంగా అమలు చేసే విషయంపై స్థానిక అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసినట్లు తెలిసింది. హైలెవెల్ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు.
